ప్రధాని పొదుపు మంత్రంతో తెలంగాణకు చిక్కులు

కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రధాని మోదీ పేర్కొన్న నిబంధనల (PM Fuel Saving Drive) తో రాష్ట్ర ఆర్థిక వనరులకు గండి పడనున్నది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడకం, కార్ పూలింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర మార్గాలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గిస్తున్నా మరో రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోనున్నది. ఎలాగూ కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందడంలేదు.. గ్రాంట్లు కూడా విడుదల కావడంలేదు.. చివరకు ఆంక్షలు, జాగ్రత్తల పేరుతొ సొంత ఆదాయానికీ కత్తెర పడే అవకాశమున్నది.. ఇదీ ఆర్థికశాఖ అధికారుల ఆందోళన. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ సెక్షన్ల ప్రజలకు ఇస్తున్న రాయితీలు, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితరాలకు విడుదల చేసే నిధులపై ఈ ఆంక్షల ప్రభావం పడనున్నది. ఖజానాకు రావాల్సిన ఆదాయానికి కత్తెర పడుతుండడంతో బడ్జెట్ అంచనాలూ తారుమారు కానున్నాయి.

రాష్ట్ర సర్కారుకు నిధుల సంకటం :

పెట్రోల్, డీజిల్‌ను పొదుపుగా వాడుకునేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాల్సిందిగా ప్రధాని పిలుపునిచ్చారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై ఆధారపడే రాష్ట్రాలకు ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. ఆ ప్రభావం రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై నేరుగా పడుతుంది. కన్జూమర్ బేస్డ్ ఎకానమీపై ఆధారపడే తెలంగాణ లాంటి రాష్ట్రాలకు వ్యాట్‌, జీఎస్టీ ఆదాయాలు గణనీయంగా పడిపోయే ప్రమాదమున్నది. ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ ధరలను పెంచడంతో ఫుట్‌పాత్ ఫుడ్ స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరిగి గతంతో పోలిస్తే బిజినెస్ తగ్గిపోయిందనే ఆందోళన కొనసాగుతున్నది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పొదుపు మంత్రంతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఐటీ కంపెనీలు శ్రీకారం చుడితే ఈ వ్యాపారం మరింత పడిపోతుందన్నది చిరు వ్యాపారుల ఆవేదన. ప్రధాని సూచించిన చర్యలు పర్యావరణానికి మేలు చేసినా రాష్ట్రాలకు సమకూరే పన్ను ఆదాయంపై ప్రభావం పడుతుందన్నది ఆర్థికవేత్తల వాదన.

పెట్రోల్‌, డీజిల్‌పైనే భారీ ఆదాయం :

దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చినా పెట్రోలు, డీజిల్ మాత్రం దాని పరిధిలోకి రాలేదు. దీంతో రాష్ట్రాలు ‘వ్యాట్’ రూపంలో పన్ను వసూలు చేస్తున్నది. చాలా రాష్ట్రాల సొంత ఆదాయానికి ఇదే ప్రధాన వనరు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా పెట్రో ఉత్పత్తుల విక్రయాలపై వ్యాట్ ద్వారా ఏటా గణనీయమైన స్థాయిలో ఆదాయం సమకూరుతున్నది. పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గితే రాష్ట్రానికి వచ్చే వ్యాట్ ఆదాయం కూడా తగ్గతుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు అంచనా మేరకు రావడం లేదనే అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యాట్‌, స్టేట్ జీఎస్టీ మందగిస్తే రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. బడ్జెట్ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణకు వ్యాట్‌, సేల్స్ ట్యాక్స్ రూపంలో వచ్చిన ఆదాయం…
• 2022-23లో రూ.29,604 కోట్లు
• 2023-24లో రూ.29,990 కోట్లు
• 2024-25లో రూ.31,816 కోట్లు
• 2025-26లో రూ.35,464 కోట్లు
• 2026-27 అంచనా రూ.38,106 కోట్లు

కాన్వాయ్‌లలో కోత… ‘వర్క్ ఫ్రం హోమ్‌’తో మరింత నష్టం :

ప్రధాని సూచించినట్లుగా రాష్ట్రంలోనూ మంత్రులు, వీఐపీల కాన్వాయ్‌లను కుదిస్తే ప్రభుత్వ వాహనాల ఇంధన వినియోగం తగ్గుతుంది. ప్రభుత్వ శాఖల్లో షేర్డ్ వెహికల్స్ (కార్ పూలింగ్) వినియోగం పెరిగితే రోజువారీ పెట్రోల్‌, డీజిల్ వినియోగం కూడా బాగా తగ్గుతుంది. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులున్నారు. “వర్క్ ఫ్రమ్ హోమ్” అమలైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం పడుతుంది. పెద్ద ఎత్తున ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తారు. హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌ లావాదేవీలు తగ్గుతాయి. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తే రవాణాపై మాత్రమే కాక నగర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన చిన్న వ్యాపారాలపై కూడా ప్రభావం పడుతుంది. రైతుభరోసా, ఉచిత విద్యుత్‌, పెన్షన్లు, మహిళా సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలకు నిధుల విడుదలలో చిక్కులేర్పడుతాయి. పేద ప్రజలపై అది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

ప్రధాని జాగ్రత్తలతో..

• క్యాబ్ సర్వీసుల వినియోగం తగ్గుతుంది
• ఉద్యోగుల వ్యక్తిగత వాహనాల ప్రయాణాలు తగ్గుతాయి
• పెట్రోల్, డీజిల్ వినియోగం పడిపోతుంది
• పెట్రోల్‌, డీజిల్ అమ్మకాలూ తగ్గుతాయి
• ప్రభుత్వానికి వచ్చే వ్యాట్ ఆదాయమూ తగ్గుతుంది
• రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్లు
• టీ స్టాల్స్, చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్‌లు, హాస్టళ్లు, ఆటో, క్యాబ్ సేవలు తగ్గుతాయి.

జీఎస్టీ ఆదాయానికీ గండి :

తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ (స్టేట్) వాటా గణనీయం. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే జీఎస్టీ ద్వారా సమకూరే ఆదాయం కూడా తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వేసుకున్న అంచనాలు తారుమారయ్యే అవకాశమున్నది. ఇప్పటికే గత ప్రభుత్వ అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీ భారంతో ప్రభుత్వం సతమతమవుతున్నది. ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ ఫిట్‌మెంట్, డీఏ బకాయిల పేమెంట్.. వీటన్నింటికీ నిధుల కొరత ఏర్పడుతుంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. కుటుంబాల నెలవారీ ఖర్చులూ పెరుగుతాయి.

రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ఇలా…

• 2022-23లో రూ.36,248 కోట్లు
• 2023-24లో రూ.39,295 కోట్లు
• 2024-25లో రూ.42,443 కోట్లు
• 2025-26లో రూ.50 వేల కోట్లకు పైగా
• 2026-27లో రూ.52,490 కోట్లు (అంచనా)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>