Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ గులాబీ కోటలో హరీశ్ సీక్రెట్ ఆపరేషన్..

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. పదేండ్లపాటు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కోటలో.. ఇప్పుడు సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారా? మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వరుస పర్యటనలు, జగదీశ్ రెడ్డి వ్యతిరేక వర్గంతో ఆయన జరుపుతున్న రహస్య మంతనాలు జిల్లా గులాబీ రాజకీయంలో పెను తుఫానుకు సంకేతాలు ఇస్తున్నాయి. ‘ఆపరేషన్ హరీశ్’ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ఇది కేవలం పార్టీ బలోపేతమా లేక నాయకత్వ మార్పునకు నాందియా? అన్న చర్చ క్యాడర్‌లోనూ మొదలయ్యింది. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సరిగ్గా ఈ ‘వ్యతిరేక వర్గాన్ని’ హరీశ్ రావు అక్కున చేర్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జగదీశ్ రెడ్డి వర్గం వర్సెస్ అసంతృప్త నేతలు..

గత పదేండ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా వెలిగిన జగదీశ్ రెడ్డికి (Jagadish Reddy), ఇప్పుడు జిల్లాలోని కీలక నేతలే సవాల్ విసురుతున్నారు. జగదీశ్ రెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తమ నియోజకవర్గాల్లో ప్రత్యర్థి వర్గాలను (ఉదాహరణకు సాగర్‌లో కోటిరెడ్డి, నకిరేకల్, కోదాడలో ఇతర నేతలు) ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తి మాజీ ఎమ్మెల్యేల్లో బలంగా ఉంది. అధిష్టానం వద్ద తమ గోడు వినిపించినా ఫలితం లేకపోవడంతో, జగదీశ్ రెడ్డికి చెక్ పెట్టగల ఏకైక నాయకుడు హరీశ్ రావు మాత్రమేనని భావించి ఈ నేతలంతా ఆయన చుట్టూ చేరుతున్నారు. ప్రధానంగా కోదాడ (మల్లయ్య యాదవ్), నకిరేకల్ (చిరుమర్తి లింగయ్య), నాగార్జున సాగర్ (నోముల భగత్) వంటి నియోజకవర్గాలపై హరీష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల కోదాడ సమావేశంలో జగదీశ్ రెడ్డి ఫోటోలు లేకపోవడం కేవలం పొరపాటు కాదు, అది ఒక స్పష్టమైన సంకేతం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

జగదీశ్ రెడ్డి ఇమేజ్‌కు గండం?

ఉద్యమ కాలం నుండి కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) లకు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న జగదీశ్ రెడ్డికి ప్రస్తుత పరిణామాలు కొంత ఇబ్బందికరమే. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) వంటి వారు జిల్లాలో జోక్యం చేసుకోవాలని చూస్తే జగదీశ్ రెడ్డి అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు హరీశ్ రావు నేరుగా కేడర్‌లోకి వెళ్తుండటం జగదీశ్ రెడ్డికి పెద్ద సవాల్‌గా మారింది. హరీశ్ దూకుడు పెంచుతున్న వేళ, జగదీశ్ రెడ్డి వర్గం కేటీఆర్ ద్వారా తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీలో కేటీఆర్ వర్గం, హరీష్ వర్గం అనే విభజన నల్లగొండ వేదికగా స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం హరీశ్ రావు వస్తున్నారని కొందరు కేడర్ సంతోషపడుతుంటే, అగ్ర నేతల మధ్య ఈ విభేదాలు పార్టీని దెబ్బతీస్తాయని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గాదరి కిషోర్ వంటి నేతలు హరీశ్ మీటింగ్ లకు దూరంగా ఉండటం పార్టీలో నిలువు చీలికకు అద్దం పడుతోంది.

ఆలేరులో గొంగడి సునీత (Gongidi Sunitha) వర్గం హరీశ్ కు మద్దతుగా నిలవడం జిల్లాలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయని చెబుతోంది. నల్లగొండ బీఆర్ఎస్ లో జరుగుతున్నది కేవలం సమావేశాలు మాత్రమే కాదు.. అది నాయకత్వ మార్పు, ఆధిపత్య పోరులో భాగమే. జగదీశ్ రెడ్డిని కాదని హరీశ్ రావు అడుగులు వేయడం వెనుక అధిష్టానం మౌన సమ్మతి ఉందా? లేక ఇది హరీశ్ సొంత వ్యూహమా? అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో హరీశ్ మంటలు జగదీశ్ రెడ్డి రాజకీయ ప్రాబల్యానికి పరీక్షగా మారాయి అనడంలో సందేహం లేదు.

Read Also: హనుమకొండలో టూరిజం మొబైల్ మ్యూజియం ప్రారంభం

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>