మోదీ ఇంధన పొదుపు పిలుపు.. క్యాబ్ డ్రైవర్లకు కష్టకాలం

కలం, తెలంగాణ బ్యూరో : పెట్రోలు, డీజిల్ వాడకాన్ని తగ్గించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని క్యాబ్ డ్రైవర్ల (Cab Drivers) జీవితాలను గందరగోళంలోకి నెట్టింది. కరోనా కాలం నాటి ఆర్థిక కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైమ్‌లో కొత్త ఆంక్షలు పెట్టడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుందనే టెన్షన్ మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని సూచించడంతో నగరంలోని ఐటీ కంపెనీలు ఆ విధానానికి వెళ్తే ఇల్లు గడవడం కష్టంగా మారుతుందనే ఆందోళన మొదలైంది. నగరంలో సుమారు 1.20 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లకు ఇప్పుడు ప్రధాని పిలుపుతో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. దీనికి తోడు పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతాయనే అంచనాలు వారి రోజువారీ ఆదాయాన్ని కూడా ప్రశ్నార్ధకంగ మారుస్తాయని భయపడుతున్నారు.

ఐటీ కంపెనీలకు సుమారు 36 వేల క్యాబ్‌లు :

నగరంలో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, డీఎల్ఎఫ్, రాయదుర్గం, ఉప్పల్, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు రోజూ దాదాపు 36 వేల క్యాబ్ సర్వీసులు నడుస్తున్నాయి. నగరంలోని అన్ని ఐటీ కంపెనీల్లో పనిచేసే సుమారు 9 లక్షల మంది ఉద్యోగుల్లో సగం వరకు ఈ క్యాబ్ సర్వీసులను కంపెనీలు సమకూరుస్తున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ రూల్ అమల్లోకి వస్తే క్యాబ్ సర్వీసులు మొత్తం నిలిచిపోయే ప్రమాదమున్నది. లేదా ప్రస్తుతం నడుస్తున్న వాహనాల్లో నామమాత్రంగానే కొనసాగించే అవకాశమున్నది. క్యాబ్ సర్వీసులతో కుదిరిన ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకునే అవకాశాలపైనే ఇప్పుడు డ్రైవర్లలో ఆందోళన కనిపిస్తున్నది. దీనికి తోడు వర్క్ ఫ్రం హూమ్ మొదలైతే కంపెనీల సమీపంలోని రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు, హోటళ్ళ బిజినెస్ పడిపోయి వారి జీవితం కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదమున్నది.

బ్యాంకులకు, ఫైనాన్షియర్లకు ఈఎంఐ కట్టేదెలా? :

బ్యాంకులు, ఫైనాన్షియర్ల నుంచి తీసుకున్న లోన్లతో వాహనాలు కొన్నామని, ప్రతి నెలా ఈఎంఐలు కడుతున్నామని, ఇప్పుడు ప్రధాని మోదీ పొదుపు మంత్రంతో రాష్ట్ర, దేశ ఎకానమీ సంగతేమోగానీ డ్రైవర్లకు మాత్రం పొట్ట నిండడం కష్టమవుతుందని క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ వ్యాఖ్యానించారు. ఒకవైపు ఈఎంఐలు, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం.. ఇవన్నీ భరించాల్సి ఉంటుందని, హఠాత్తుగా పొదుపు సూత్రాన్ని అమలు చేయాల్సి రావడం ఇబ్బందులు సృష్టిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ఇంకోవైపు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయని, ఆ ఎఫెక్టు మరింత ఘోరంగా ఉంటుందన్నారు.

ఈవీ క్యాబ్‌లకు వర్తించని రాయితీ స్కీమ్ :

నగరంలో వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆటోలన్నీ ఎలక్ట్రిక్ మోడ్‌లో మారేందుకు రీట్రో ఫిట్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. కానీ ఇదే సౌకర్యాన్ని క్యాబ్ కార్లకు ఎందుకు కల్పించకూడదన్న అంశాన్ని ఆ సంఘం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొన్నట్లయితే 20% రాయితీ ఇచ్చేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇదే సౌకర్యాన్ని క్యాబ్ సర్వీసులకు కల్పించాలని ఆ సంఘం అధ్యక్షుడు సలావుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ విషయంలో పూర్తి రాయితీ ఇచ్చినా వాహన ధరలో మాత్రం ఎలాంటి డిస్కౌంట్ లేకపోవడం ప్రభుత్వం ఆశించిన ఫలితం రాకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ ఆలోచన ఆహ్వానించదగిన పరిణామమే అయినా ఆకస్మికంగా అమల్లోకి రావడం, ఆల్టర్నేట్‌ను సూచించకపోవడం క్యాబ్ డ్రైవర్లకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లయిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>