జిల్లాల బాటలో సీఎం.. ఆసక్తికరంగా BRSపై కౌంటర్ స్ట్రాటజీ

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వ్యవసాయ విధానాలపై కొత్త అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం నేరుగా రైతులతోనే మాట్లాడాలని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) భావిస్తున్నారు. త్వరలో జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. రైతులతో ప్రత్యక్షంగా సమావేశమై పంటల మార్పిడి, మార్కెట్ ఆధారిత సాగు, వాణిజ్య పంటల ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించనున్నారు. వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయంగా ఆదాయం వచ్చే పంటలవైపు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరాన్ని సీఎం అర్థం చేయించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం గతంలో ‘క్రాప్ కాలనీ’ల పేరుతో ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచన చేసింది. అందులో భాగమే ‘వరి వేస్తే ఉరే’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పటికీ దానిపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పంటల మార్పిడిపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) రైతులతో ప్రస్తావిస్తే అదే తరహా విమర్శలు వస్తే కౌంటర్‌ ఇవ్వడానికి అవసరమైన వ్యూహం సవాలుగా మారింది.

వరి నుంచి వాణిజ్య పంటల వైపు :

తెలంగాణలో గత కొన్నేళ్లుగా వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వరి సాగుకు భారీగా నీటి వినియోగం, యూరియాకు ఏర్పడనున్న డిమాండ్, పంట విక్రయానికి కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యలు, తాలు పేరుతో తప్పుడు తూకాలు, అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోవడం, సకాలంలో లారీల్లోకి లోడ్ కాకపోవడం, హమాలీల కొరత, రైస్ మిల్లుల దగ్గర వెయిటింగ్, మార్కెట్ పరిస్థితులు, నిల్వ చేయడంలో ఇబ్బందులు, కొనుగోలు విధానాల్లో ఎఫ్‌సీఐ మార్పులు.. వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడు పంటల వైవిధ్యంపై దృష్టి పెడుతోంది. పత్తి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, హార్టికల్చర్ పంటలు, మిర్చి, పసుపు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. రైతు ఒక్క పంటపైనే ఆధారపడకుండా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తేనే దీర్ఘకాలికంగా లాభదాయక వ్యవసాయం సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ భావన. “అన్ని అవసరాలు తీరేలా రైతు కుటుంబం స్వయం సమృద్ధి సాధించాలి” అనే సందేశంతో సీఎం జిల్లాల్లో రైతు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహం

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం “వరి వేస్తే ఉరే” అన్న వ్యాఖ్య తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పటికీ కేసీఆర్‌ను ఈ విషయంలో రైతులు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలూ ఆ కామెంట్లను ప్రస్తావించి కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాయి. వరి సాగును తగ్గించి ఇతర పంటలవైపు రైతుల్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో భాగంగా అప్పట్లో కేసీఆర్ ఆ లైన్ తీసుకున్నారు. కానీ పార్టీల నుంచి విమర్శలు తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంటల మార్పిడిని ప్రోత్సహించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తే అదే తరహా విమర్శలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కౌంటర్‌గా కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం తమ విధానం పూర్తిగా భిన్నమని అంటున్నాయి. “వరి వద్దు” అనేదానికి బదులు “వరితో పాటు లాభదాయక పంటలు కూడా వేయాలి” అని అవగాహన కల్పిస్తామని చెప్తున్నాయి. రైతుల ఆదాయం పెరగడం, మార్కెట్ రిస్క్ తగ్గించడం, భూసారాన్ని కాపాడటం, నీటి వినియోగాన్ని సమతుల్యం చేయడం వంటి అంశాలను సీఎం తన పర్యటనల్లో ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ తపన :

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను కూడా సీఎం తన ప్రసంగాల్లో హైలైట్ చేయనున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, పంట బీమా వంటి అంశాలను ప్రస్తావిస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా కాంగ్రెస్ తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయాన్ని కేవలం సంప్రదాయ సాగుగా కాకుండా ఆదాయ వనరుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని అధికారులు చెబుతున్నారు. పంటల మార్పిడితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతులకు అనుసంధానం వంటి అంశాలపైనా రైతులకు అవగాహన కల్పించే అవకాశముంది. సీఎం జిల్లాల పర్యటనలు కేవలం వ్యవసాయ అంశాలకే పరిమితం కాకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై రైతుల అభిప్రాయాన్ని బలోపేతం చేయడం, బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం, రైతు అనుకూల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోవడం కూడా ఈ పర్యటనల ఉద్దేశంగా కనిపిస్తోంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతుల్లో స్పష్టమైన అవగాహన తీసుకురావడం, పంటల ప్రణాళికపై ప్రభుత్వ దిశను వివరించడం ద్వారా వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక మార్పులకు శ్రీకారం చుట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>