స్టార్ట్ అయిన ‘సర్’.. ఎవరి ఓటుకు వారే కాపలా!

కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో చేపట్టబోతున్న ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) (Telangana SIR) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియగానే కనిపిస్తున్నా ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని అత్యంత కీలక రాజకీయ ఎక్సర్‌సైజ్‌గా భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో పేర్లు గల్లంతు కావడంతో తెలంగాణలో పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ రిపీట్ కాకుండా డోర్ టు డోర్ సర్వే టైమ్‌లోనే ప్రత్యేక నిఘా వేయాలని బూత్ లెవల్ ఏజెంట్లను అన్ని పార్టీలు అప్రమత్తం చేశాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘సర్’ ప్రక్రియ జరిగే తీరును వివరించారు. తెలంగాణ పీసీసీ చీఫ్ నేతృత్వంలోని బృందం సీఈఓను శుక్రవారం కలవనున్నది. ఓటర్ల జాబితాలో ఒక్క పేరు కూడా అకారణంగా డిలీట్ కాకూడదన్నది పార్టీల ఉద్దేశం. దీంతో ఎవరి ఓటుకు వారే కాపలాగా ఉండాలనే మాటలు వినిపిస్తున్నాయి.

ప్రతీ ఇంటికి బూత్ లెవెల్ ఆఫీసర్లు :

ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి, తప్పుల్లేకుండా రూపొందించడానికి ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక ప్రక్రియను చేపట్టింది. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించడం, చిరునామాను ధృవీకరించుకోవడం, మరణించినవారి పేర్లను తొలగించడం, డూప్లికేట్ ఎంట్రీలు లేకుండా చేయడం, కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయడం.. ఇలాంటివన్నీ ఈ ప్రక్రియలో ఉంటాయి. ఇది కేవలం రొటీన్‌గా జరిగే ప్రక్రియ కాదని, భవిష్యత్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే కీలక ఘట్టం అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలు, వలస జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలు, అద్దె ఇళ్లలో నివసించే ఓటర్లు, ఉద్యోగ రీత్యా తరచూ మారే కుటుంబాల ఓట్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని పార్టీలు భావిస్తున్నాయి. గతంలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ సమయంలో వేల సంఖ్యలో పేర్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. తమిళనాడులోనూ కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలవారీగా ఓట్లు డిలీట్ అయ్యాయనే వివాదాలు తలెత్తాయి. ఈ అనుభవాల కోణంలో తెలంగాణ పార్టీలు దగ్గరగా జాగ్రత్తలు తీసుకున్నాయి.

బూత్‌లో 50 ఓట్లు తగ్గినా ఫలితాలపై ప్రభావం :

ఒక్కో బూత్‌లో సగటున 1200 మంది ఓటర్లు ఉంటారు. ఇందులో 50 నుంచి 100 ఓట్లు మారినా ఫలితాలపై ప్రభావం పడుతుందన్నది పార్టీల భావన. అందుకే పార్టీలు బూత్ స్థాయి యంత్రాంగాన్ని పకడ్బందీగా నిర్మించుకుంటున్నాయి. బీఎల్ఓలు ‘డోర్ టు డోర్’ తిరిగి చేసే సర్వేలో బూత్ ఏజెంట్లు తప్పకుండా ఉండాలని పార్టీలు స్పష్టం చేశాయి. ఒక ఓటరు పేరును తొలగించినా, కొత్తగా చేర్చినా అలర్టుగా ఉండాలని చెప్పాయి. అన్ని ప్రధాన పార్టీలు వాటి ఏజెంట్లకు ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేశాయి. ఓటర్ల పేర్లను బీఎల్వోలు ధృవీకరించే సమయంలో స్థానికంగా ఉండే పార్టీల ఏజెంట్లు గమనించాలని, వారిని గైడ్ చేయడానికి బూత్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని చెప్పాయి. పట్టణ నియోజకవర్గాల్లో అపార్ట్‌మెంట్‌లు, హాస్టళ్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌, విద్యార్థుల ఓట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరమన్నాయి.

నేడు సీఈఓతో పీసీసీ చీఫ్ టీమ్ సమావేశం :

తెలంగాణ పీసీసీ చీఫ్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం సీఈఓతో శుక్రవారం సమావేశమవుతున్నది. ఇది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఓటర్ల పేర్లు తొలగింపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, ప్రతి మార్పుపై పారదర్శక సమాచారం అందుబాటులో ఉండాలని కాంగ్రెస్‌ కోరనున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అవగాహన తక్కువగా ఉండటంతో సాధారణ ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోలేకపోతున్నారని, అందుకే ఫీల్డ్ స్థాయిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కూడా సూచించే అవకాశమున్నది. బీజేపీ, బీఆర్ఎస్ సైతం ‘సర్’ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. ఇతర దేశాల నుంచి అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్నవారి పేర్లు జాబితాలోకి ఎక్కకుండా బీజేపీ అప్రమత్తమైంది. బూత్ స్థాయి కమిటీలకు, ఏజెంట్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చింది. కొత్త ఓటర్ల నమోదు, ఫస్ట్ టైమ్ ఓటు హక్కు పొందే యువతపై దృష్టి పెట్టాలని చెప్పింది.

సైలెంట్ వార్.. వార్ రూమ్ మెకానిజం :

అర్బన్ ఓటర్లలో పేర్ల తొలగింపుపై వచ్చే ఫిర్యాదులను వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ తరహా మానిటరింగ్ వ్యవస్థపై పార్టీలు ఆలోచిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా కీలకం కావడంతో ఎన్నికల ముందు ‘సర్’ ప్రక్రియను ‘సైలెంట్ వార్’గా భావిస్తున్నాయి. ప్రతీ పార్టీ బలమైన ఓటు బ్యాంక్‌లో ఒక్క పేరు కూడా తగ్గిపోకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇకపై ఎన్నికల ప్రచారాల కంటే ముందే ‘ఎవరి ఓటుకు వారే కాపలా’ అనే పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతీ ఓటరు వారి పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయో లేవో చూసుకుని అభ్యంతరాలకు ఇచ్చిన నెల రోజుల గడువులోనే కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి సరిదిద్దుకోవాలని పిలుపు ఇచ్చే అవకాశాలున్నాయి. ‘సర్’ ప్రక్రియపై కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి షెడ్యూలు ప్రకటించడంతో అక్టోబరు 1 వరకు ఎలాంటి వివాదం నెలకొంటుందో అంచనాకు అందడంలేదు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>