కలం, వలిగొండ: ‘దేశానికి వెన్నెముక రైతు, రైతుల సంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయం’ అనే డైలాగ్స్ కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప, ఆచరణలో మాత్రం ముందుకు సాగడం లేదు. రోజులు గడుస్తున్నా వలిగొండ (Voligonda) పరిధిలో ధాన్యం కొనుగోళ్లలో పరిస్థితి దయనీయంగా ఉందని రైతులు వాపోతున్నారు. రైతులు (Farmers) విత్తనాలు కొనుగోలు చేసిన నాటి నుంచి దుక్కి దున్ని, నారు పోసి నాటు వేసే వరకు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కల్లాలకు తరలిస్తే, కంటిమీద కునుకులేకుండాపోతోంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు తాలు, తేమ పేరిట రైతులను మోసం చేస్తూ కిలోల కొద్ది కోత పెడుతున్నారు. 40 కిలోల బస్తాకు రెండు కిలోలను అదనంగా తూకం వేస్తూ, తరుగు పేరుతో ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

