కలం, వెబ్ డెస్క్: నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ(BJP) ఎంపీ లక్ష్మణ్(MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ప్రకటించారు. సోమవారం బీజేపీ తెలంగాణ కార్యాలయంలో భారత గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్రం త్వరలో జనగణన(Census) చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది పూర్తవడానికి ఎక్కువ సమయం పట్టదని, ఆరు నెలల్లోనే పూర్తవుతుందని చెప్పారు. జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లతో పాటు ప్రక్రియ అంతా ఎన్నికలలోపే పూర్తవుతుందని తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.


