epaper
Monday, January 19, 2026
spot_img
epaper

దావోస్ లోనే పెట్టుబడుల సదస్సు ఎందుకు.. ఎప్పుడు మొదలైంది..?

కలం, వెబ్ డెస్క్ : దావోస్.. ఈ చిన్న నగరం ప్రపంచాన్ని నడిపించే నిర్ణయాలకు వేదిక. ప్రపంచ అభివృద్ధిని మార్చిన ఎన్నో సదస్సులకు ఈ చిన్ని నగరమే సాక్ష్యం. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మార్పులకు ఇక్కడే చర్చలు జరిగాయి.. ఇప్పటికీ జరుగుతున్నాయి. దావోస్ (Davos) అంటేనే పెట్టుబడులు, అవకాశాల వేట. స్విట్జర్ ల్యాండ్ లోని చిన్న పట్టణమైన దావోస్ లో సోమవారం నుంచి ఐదు రోజుల పాటు మళ్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పెట్టుబడుల సదస్సు జరగబోతోంది. దీనికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయలుదేరి వెళ్లారు. మన దేశం తరఫున కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు వెళ్తున్నారు. దాదాపు 68 దేశాల నుంచి 450 మందికి పైగా రాజకీయ నాయకులు, 1500 మందికి పైగా వ్యాపారవేత్తలు ఇక్కడకు వస్తుంటారు. వ్యాపార వేత్తలు కొత్త అవకాశాల కోసం, రాజకీయ నేతలు పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా చర్చలు జరుపుతుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో వసతులు లేని దావోస్ లోనే ఈ పెట్టుబడుల సదస్సు ఎందుకు జరుగుతుందనేది చాలా మందికి తెలియదు.

ఎలా మొదలైందంటే..?

దావోస్ (Davos) అనేది చిన్న నగరం. 19వ శతాబ్ధంలో ప్రపంచాన్ని టీబీ మహమ్మారి కమ్మేసినా.. ఈ దావోస్ ను టచ్ చేయలేదు. చుట్టూ మంచు కొండలు ఉండటం వల్ల టీబీ ఇక్కడ వ్యాపించలేదు. దీంతో స్వచ్ఛమైన గాలి కోసం ఐరోపా దేశాల నుంచి వ్యాపారస్తులు, ప్రముఖులు, ధనవంతులు ఇక్కడకు వచ్చేవారు. ఆ సమయంలో దావోస్ లో ఇంగ్లిష్ కిర్క్ అనే చర్చిని ప్రారంభించారు. రాను రాను ఇది రిసార్టుగా పట్టణంగా.. పర్యాటకుల హబ్ గా మారిపోయింది. హాయిగా సేదతీరడానికి, ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి దీన్ని ఎంచుకున్నారు. ధనవంతులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఇక్కడికి రావడంతో మెల్లిగా వ్యాపార చర్చలు ఇక్కడ మొదలయ్యాయి. అవి కాస్త పెరుగుతుండటంతో 1971 జనవరిలో యూరోపియన్ మేనేజ్ మెంట్ ఫోరం పేరుతో డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు క్లాజ్ స్వాబ్ పెట్టుబడుల మొదటి సదస్సు నిర్వహించారు. తొలి సదస్సుకే ఐరాపా దేశాలకు చెందిన 400 మంది వ్యాపారస్తులు రావడంతో సూపర్ సక్సెస్ అయింది.

కీలకమైన చర్చలు..

రాను రాను ఐరాపా దేశాలే కాకుండా ప్రపంచ దేశాల పెట్టుబడిదారులను ఇక్కడకు ఆహ్వానించారు. ఇక్కడ ప్రార్థనల కోసం ప్రారంభించిన ఇంగ్లిష్ కిర్క్ చర్చ్.. ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సుకు కేంద్రంగా మారింది. డబ్ల్యూఈఎఫ్ ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. అమెరికా లాంటి పెద్ద దేశాల నుంచి.. చిన్న దేశాల దాకా ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. ఇక్కడ జరిగిన సదస్సులు ఎన్నో దేశాల రూపురేఖలే మార్చేశాయి. మన దేశానికి కూడా లక్షల కోట్ల పెట్టుబడులు ఈ దావోస్ నుంచే వచ్చాయి. చరిత్రలో నిలిచిన ఎన్నో పెద్ద చర్చలకు దావోస్ వేదికైంది. 1988లో గ్రీస్, టర్కీ దేశాల మధ్య డిక్లరేషన్ యుద్ధాన్ని నివారించిన మీటింగ్ ఇక్కడే జరిగింది. 1989లో నార్త్ కొరియా, సౌత్ కొరియాల తొలి మంత్రిత్వ సమావేశం కూడా ఇక్కడే నిర్వహించారు. గాజా, జెరికో ఒప్పందం, జర్మనీ పునరేకీకరణకు ఇక్కడే చర్చలు జరిపారు. ఒప్పందాలు చేసుకున్నారు.

పెట్టుబడుల ప్రాసెస్ ఇలా..

ఇప్పుడు జరుగుతున్న పెట్టుబడి సదస్సులో పాల్గొనే ప్రతి దేశం ఒక స్టాల్ ను ఏర్పాటు చేస్తుంది. తమ దేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తాము ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తారు. అక్కడ పాల్గొనే పెట్టుబడిదారులు ఆయా దేశాలతో చర్చలు జరిపి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే అక్కడే ఒప్పందాలు చేసుకుంటారు. ఈ సదస్సుకు స్విట్జర్ ల్యాండ్ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అంతర్జాతీయ ప్రతినిధులు రావడం వల్ల.. ఈ ప్రాంతం మొత్తాన్ని కవచంలా స్విస్ బలగాలు కాపాడుతాయి. ప్రపంచ స్థాయి సదస్సులు జరుగుతున్నా.. ఇప్పటికీ దావోస్ లో 10 మీడియం హోటళ్లు, 40 చిన్న హోటళ్లు మాత్రమే ఉన్నాయి. స్టార్ హోటళ్లు, స్టార్ స్టేటస్ వసతులు ఇక్కడ మనకు కనిపించవు. కానీ దావోస్ అంటే పెట్టుబడులకు ప్రత్యేకం. మరి ఈ సారి దావోస్ పెట్టుబడుల సదస్సులో ఇండియాకు, తెలంగాణ, ఏపీలకు ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>