కలం, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్, సీపీఐ (CPI, Congress) పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి రాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో సీపీఐ ఒంటరి పోరుకు సిద్ధమైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా, సీపీఐ 30 స్థానాలను డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు మొగ్గు చూపడంతో చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం సీపీఐ అభ్యర్థులు మొత్తం 60 డివిజన్లలో తమ నామినేషన్లను సమర్పించారు.
ఇదే తరహా పరిస్థితి జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లోనూ కనిపిస్తోంది. ఇల్లందులో సైతం రెండు పార్టీల మధ్య దోస్తీ కుదరకపోవడంతో సీపీఐ ఆరు వార్డుల్లో బరిలోకి దిగింది. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో నామినేషన్లు వేసింది. ఇక్కడ సీపీఐ 15 వార్డుల్లో పోటీకి దిగుతూ నామినేషన్లు దాఖలు చేసింది.
మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలోనూ పొత్తు పొడవలేదు. ఇక్కడ ఉన్న 22 వార్డులలో కాంగ్రెస్ అన్ని చోట్లా అభ్యర్థులను నిలపగా, సీపీఐ ఐదు చోట్ల నామినేషన్లు వేసింది. ఇలా కీలక నియోజకవర్గాల్లో మిత్రపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఎన్నికల బరిలో రెండు పార్టీల మధ్య పోటీ తప్పని పరిస్థితి నెలకొంది.


