కలం, వెబ్ డెస్క్ : సైబర్ నేరాల పెరుగుదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో నిజంలా కనిపించే డీప్‌ఫేక్ వీడియోలు(Deepfake videos), ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. చూసేదంతా నిజం కాకపోవచ్చని సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోలు, ఫొటోలను జాగ్రత్తగా గమనిస్తే లైటింగ్, ముఖ కవళికలు, కదలికల్లో అసహజత్వం కనిపిస్తుందని వివరించారు.
ఇలాంటి వీడియోల పట్ల మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి ఆ కంటెంట్ ఎక్కడిదో తెలుసుకోవాలని సూచించారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా భావోద్వేగానికి లోనై సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేయడం వల్ల ఫేక్ న్యూస్ (Fake news) వ్యాప్తికి కారణమవుతుందని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా నేరానికి భాగస్వాములు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఏదైనా వీడియో, ఫొటోను షేర్ చేసే ముందు ఆలోచించాలని, నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు పంపించాలని సజ్జనార్(CP Sajjanar) సూచించారు.

