కలం, వెబ్‌డెస్క్: చాలా మంది పిల్లలు చిన్న చిన్న విషయాలకే విపరీతంగా చిరాకు పడుతుంటారు, ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తుంటారు. సాధారణంగా తల్లిదండ్రులు దీనిని కేవలం వారి మొండితనం లేదా అల్లరిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇలాంటి ప్రవర్తనను అస్సలు తేలికగా తీసుకోకూడదని, ఇది పిల్లల మానసిక ఆరోగ్యానికి (Child Mental Health) సంబంధించిందని శిశు మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ప్రకారం.. పిల్లలు తమ అసంతృప్తిని లేదా శారీరక, మానసిక ఇబ్బందులను మాటల్లో చెప్పలేనప్పుడు మాత్రమే ఇలా ఏడుపు, చిరాకు రూపంలో వ్యక్తపరుస్తారట. చిన్న చిన్న విషయాలకే కోపపడటం, నిరంతర నిరాశ, కారణం లేని తలనొప్పి, కడుపునొప్పి వంటి 6 ముఖ్యమైన లక్షణాలను సరైన సమయంలో తల్లిదండ్రులు గుర్తించి, వారితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద మానసిక సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లలలో గమనించవలసిన ఆ 6 ముఖ్యమైన లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.
1. తలనొప్పి, కడుపునొప్పి ఫిర్యాదులు
పిల్లలు తరచూ కడుపునొప్పి లేదా తలనొప్పి వస్తోందని ఫిర్యాదు చేస్తుంటే, సాధారణంగా మనం దానిని ఫుడ్ పాయిజన్ లేదా జ్వరం అనుకుంటాం. అయితే, వైద్య పరీక్షల్లో ఎలాంటి శారీరక అనారోగ్య కారణాలు లేవని తేలినప్పటికీ ఈ నొప్పులు వస్తుంటే.. అది వారు తీవ్రమైన మానసిక ఒత్తిడి (Stress) లేదా ఆందోళన (Anxiety) ఎదుర్కొంటున్నారనే దానికి బలమైన సంకేతం కావచ్చు. మనసులోని భయాలు, పాఠశాల లేదా ఇళ్లలోని సమస్యలను పిల్లలు మానసికంగా తట్టుకోలేనప్పుడు, అవి ఇలా శారీరక నొప్పుల రూపంలో బయటకు వ్యక్తమవుతాయి.
2. నిరంతర నిరాశ లేదా ఆసక్తి లేకపోవడం
సాధారణంగా పిల్లలు ప్రతి విషయంపై ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అలా కాకుండా వారు పదేపదే తీవ్రమైన నిరాశకు గురవుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దట. అంతేకాకుండా గతంలో ఇష్టంగా చేసిన పనులపై, ఆటలపై సడెన్‌గా ఆసక్తిని కోల్పోతున్నా దానిని తీవ్రంగా పరిగణించాలని సూచిస్తున్నారు.
3. చిరాకు విపరీతంగా పెరగడం
పిల్లలలో విపరీతమైన చిరాకు, అకారణంగా విసుగు చెందడం అనేది వారి మానసిక అశాంతికి, అంతర్గత ఒత్తిడికి బలమైన సంకేతంగా తల్లిదండ్రులు పరిగణించాలి. పిల్లలు తమ మనసులోని భయాందోళనలను లేదా బాధను మాటల్లో చెప్పలేనప్పుడు, అది చిరాకు, కోపంగా బయటకు వస్తుందట.
4. పిల్లలలో ఆకస్మిక భావోద్వేగ మార్పులు
పిల్లల మనస్సు తీవ్రమైన ఒత్తిడి లేదా మానసిక అశాంతిలో ఉన్నప్పుడు మాత్రమే ఆకస్మిక భావోద్వేగ మార్పులు వస్తాయి. ఒక నిమిషం క్రితం వరకు ఎంతో సంతోషంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా తీవ్రమైన విచారంలోకి లేదా కోపంలోకి మారిపోవడం కేవలం మొండితనం మాత్రమే కాదని చెబుతున్నారు నిపుణులు.
5. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం
తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్న పిల్లలు చిన్నపాటి విషయాలకే విపరీతంగా కోపగించుకోవడం, ఇంట్లో వాళ్లతో లేదా తోటి పిల్లలతో పదేపదే గొడవ పడటం వంటి ప్రవర్తనను కలిగి ఉంటారట. దీన్ని కేవలం మొండితనం అనుకుని నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు.
6. సహాయం కోసం..
పిల్లల ప్రవర్తనలో వచ్చే ఇలాంటి ఆకస్మిక మార్పులు వారు లోలోపల ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి బయటపడటానికి పెద్దల సహాయాన్ని కోరే ఒక నిశ్శబ్ద ఆర్తనాదం. వారు తమ సమస్యలను మాటల్లో చెప్పలేక, తమ ప్రవర్తన ద్వారా సహాయం కోసం సంకేతాలు పంపుతుంటారని మనం గుర్తించాలి.
తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తోంది. అదేమిటంటే పిల్లలలో ఇటువంటి ప్రవర్తనా మార్పులు కనిపిస్తే అది వారి మానసిక ఒత్తికి సంకేతంగా గుర్తించాలి. పిల్లల్లో కనిపించే ఈ ప్రవర్తనా మార్పులు పాఠశాలలో ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థుల నుండి ఎదురవుతున్న ఒత్తిడి, స్నేహితులతో సమస్యలు, కుటుంబంలో జరిగే కలహాలు లేదా వారిలోని ఒంటరితనానికి సంకేతంగా ఉండవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పుగా చెప్పి భయపెట్టినా పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారని చెబుతున్నారు.
అందుకే పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలట. వారిని చిన్న విషయాలకే తిట్టడం లేదా కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్తమ స్నేహితులుగా ఉండాలని చెబుతున్నారు. ప్రతిరోజూ వారితో నిష్కపటంగా, సానుకూలంగా మాట్లాడటం అలవాటు చేసుకోవాలట. వారు చెప్పే ప్రతి మాటను మధ్యలో అడ్డుకోకుండా శ్రద్ధగా వినడం ముఖ్యం. ఒకవేళ ఈ మార్పులు చాలా రోజుల పాటు అలాగే కొనసాగుతూ ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అనుభవజ్ఞులైన బాలల మనస్తత్వవేత్త (చైల్డ్ సైకాలజిస్ట్) లేదా కౌన్సిలర్‌ను సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తును సురక్షితంగా కాపాడుకోవచ్చు.

