Mobile Popup Ad
Mobile Popup Ad

ఖరీఫ్ ముంగిట.. నకిలీ విత్తన భూతం!

కలం, వరంగల్ బ్యూరో: ఖరీఫ్ సీజన్ ముంగిట రైతన్నలను నకిలీ విత్తన భూతం (Fake Seeds Mafia) భయపెడుతున్నది. దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్ర సరిహద్దుల నుంచి నకిలీ విత్తన మాఫియా పంజా విసురుతున్నది. అధిక దిగుబడులంటూ మాయమాటలు చెప్పి అనుమతి లేని పత్తి, మిర్చి, మొక్కజొన్న విత్తనాలను దళారుల ద్వారా గ్రామాలకు తరలిస్తున్నది. గతంలో జరిగిన ఘటనలు రైతులను తీవ్రంగా నష్టపరిచిన నేపథ్యంలో అధికారులు టాస్క్ ఫోర్స్ టీమ్స్తో నిఘా ముమ్మరం చేశారు.

నకిలీ విత్తనాల పంపిణీని అరికట్టేందుకు వ్యవసాయశాఖ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయి. అయినప్పటికీ నకిలీ మాఫియా ఆగడాలు ఆగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను వేగవంతం చేస్తూ.. అక్రమ నిల్వలు, గడువు ముగిసిన ఎరువుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. లైసెన్స్లు లేని దుకాణాలను గుర్తించడం, విత్తన సరఫరాలో పారదర్శకతను పెంచేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచారు. ఎరువుల ధరలు, స్టాక్ వివరాలు ఎమ్మార్పీకి అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.

వరుస దాడులు.. పలువురు అరెస్ట్

అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో వరుస దాడులతో నకిలీ విత్తన మాఫియా (Fake Seeds Mafia)కు చుక్కలు చూపిస్తున్నది. ఇందులో భాగంగానే గత నెల 30న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాలో 28 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, సరఫరాదారులు, విక్రయదారులను కటకటాల్లోకి పంపారు. అలాగే, రాష్ట్రవ్యాప్త నిఘాలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర నకిలీ విత్తన ముఠాను పట్టుకుని, సుమారు రూ. 20 లక్షల విలువైన 792 పత్తి విత్తన సంచులను సీజ్ చేశారు. ఈ కేసులో గుజరాత్, మహారాష్ట్రకు చెందిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అవసరమైతే పీడీ యాక్ట్..

ఎరువులు, విత్తనాల దుకాణాలు వ్యవసాయ శాఖ నుంచి కచ్చితమైన లైసెన్స్లు కలిగి ఉండాలని, ఎఫ్సీఓ, బీఐఎస్ ప్రమాణాలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్లను పక్కాగా నిర్వహించడం, ధరల జాబితాను ప్రదర్శించడం వంటి నిబంధనలు విధిగా అమలు చేయాలని డీలర్లకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించే వారిపై నిరంతరం నిఘా ఉంచారు.

రైతులకు సూచనలు

– విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.
– విత్తనం ఏదైనా, కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా పక్కా బిల్లు తీసుకోవాలి. లేబుళ్లు, బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి.
– నాణ్యత విషయంలో అనుమానం ఉంటే వెంటనే స్థానిక వ్యవసాయశాఖ అధికారికి తెలియజేయాలి. ఈ-కృషి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు చేయవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>