కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు ‘సర్’ (SIR) ఫీవర్ పట్టుకున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఇలా ఏ పార్టీని కదిలించినా దీనికి సంబంధించిన అలజడే. అన్ని పార్టీలూ ‘సర్’ ట్రెయినింగ్‌పై ఫోకస్ పెట్టాయి. గిట్టని ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర దీని వెనుక దాగి ఉందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ జరగనుంది. దీంతో దానిపై అప్రమత్తమైన పార్టీలు.. బూత్ లెవెల్ ఏజెంట్లకు, కేడర్‌కు అవగాహన కల్పిస్తున్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేసే టైమ్‌లో అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాయి. ఈ నెల రోజుల ప్రక్రియలో ఓటర్ల పేర్ల చేరిక, డిలీషన్ విషయంలో ఏమరుపాటుగా ఉంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల మొదలు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఈ జాబితాయే ఆధారమని వివరిస్తున్నాయి. పశ్చిమబెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ.. తదితర రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతైన అనుభవంతో తెలంగాణలో ఎంతమంది పేర్లు గాయబ్ అవుతాయోనని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.
సెంటర్ పాయింటర్‌గా హైదరాబాద్
జనరల్‌గా ఎన్నికలకు ముందు స్పెషల్ సమ్మరీ రివిజన్ పేరిట జరిగే ఈ ప్రక్రియ ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో జరుగుతుండడం పొలిటికల్‌గా సెన్సిటివ్ అంశంగా మారింది. పార్టీలన్నీ వ్యూహాలను రూపొందించుకున్నాయి. హైదరాబాద్ సిటీలో హిందు వ్యతిరేక ఓటర్ల పేర్లను తొలగించడమే ఈ ప్రక్రియ ప్రధాన టార్గెట్‌గా ఉంటుందని ప్రత్యక్షంగా మంత్రి అజారుద్దీన్, పరోక్షంగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. రకరకాల కారణాలతో ముస్లిం ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ జరుగుతుందని, ఎవరి ఓటును వారే కాపాడుకోవాలని వీరితో పాటు అన్ని పార్టీల నేతలు ఓటర్లకు పిలుపునిచ్చారు. పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, పోలింగ్ బూత్, ఓటర్ ఐడీ.. ఇలాంటివి మిస్‌మ్యాచ్ అయ్యాయనే పేరుతో తొలగించే ప్రమాదమున్నదని ఏజెంట్లకు పార్టీలు వివరించాయి. తగిన ఆధారాలను చూపించలేకపోయారనే పేరుతో డిలీట్ చేసే అవకాశమున్నదని పేర్కొన్నాయి.
ప్రామాణికంగా 2002 ఓటర్ల జాబితా
ఇప్పుడు జరుగుతున్న ‘సర్’ ప్రక్రియకు 2002 నాటి ఓటర్ల జాబితా ప్రామాణికం అవుతున్నది. ఆ జాబితాలో పేరు ఉండి ఇప్పుడున్న లిస్టులోనూ పేరు ఉన్నట్లయితే ఎలాంటి చిక్కులూ ఉండవు. కానీ ఆ జాబితాలో పేరు లేకపోతే మాత్రం ఎలక్షన్ కమిషన్ సూచించిన 11 రకాల పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. ‘సర్’ ప్రక్రియను చేపట్టడానికి ముందు బీఎల్వోలు ప్రీ-ఎక్సర్‌సైజ్ పేరుతో 2002 జాబితాను పరిగణనలోకి తీసుకుని మ్యాపింగ్ చేసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన మొబైల్ యాప్ వాడారు. రాష్ట్రంలో దాదాపు 40% మేర పేర్లు, అడ్రస్, వివరాలు మిస్‌మ్యాచ్ అయినట్లుగా తేలింది. సరైన వివరాలు ఇవ్వకుండా ఓటరుగా జాబితాలో చేరాలనుకున్నవారికి ఈసీ నుంచి నోటీసులు అందుతాయి. అందులో పేర్కొన్న వివరాలకు తగినట్లుగా ప్రూఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. లేనట్లయితే ఆ పేర్లు పాత జాబితా నుంచి డిలీట్ అవుతాయి. కొత్త జాబితాలో చేరవు.
అడ్రస్ మారుతున్నవారికి చిక్కులు
చదువు లేదా ఉపాధి లేదా ఇతర కారణాలతో వలస వెళ్ళినవారికి అడ్రస్ మార్పుతో సర్ ప్రక్రియలో చిక్కులు ఎదురుకానున్నాయి. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువ. ఐటీ ఉద్యోగులు, అద్దెకు ఉండే కుటుంబాలు, తరచూ నివాసాలు మార్చుకునే మధ్యతరగతి వర్గాలు, కొత్త అపార్టుమెంట్ కాలనీలు పెరగడం.. ఇలాంటి కారణాలతో ఓటర్ల జాబితాలో మార్పులు ఎక్కువ. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాలపైనే పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండడం మరో కారణం. ఇంటింటి సర్వే సందర్భంగా బీఎల్వోలకు అడ్రస్ ప్రూఫ్, పాత జాబితాలోని వివరాలు, అందులో పేరు లేనట్లయితే ఇతర డాక్యుమెంట్లను ఇవ్వడం తప్పనిసరిగా మారింది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఏజ్ గ్యాప్ కూడా సంక్లిష్టమైన సమస్యగా మారుతున్నది. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సంబంధాన్ని రుజువు చేసుకునే బాధ్యత ఓటర్ల మీదనే ఉంటున్నది.
కీలకం కానున్న పుట్టిన తేదీ ప్రూఫ్
ఈసీ నిబంధనల ప్రకారం, 1987కు ముందు, 1987-2004, 2004 తర్వాత పుట్టిన వారికి వయసు ధృవీకరణ నిబంధనలు తలనొప్పి తెచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు ఓటర్ల జాబితాలో చేరాలంటే వారి ప్రూఫ్‌తో పాటు తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లనూ సమర్పించడం తప్పనిసరి. ఒకవేళ ఓటరు 1987కు ముందు పుట్టినట్లయితే వారి బర్త్ డేట్‌ను ధృవీకరించే పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది. 1987 జులై 1 నుంచి 2004 డిసెంబర్ 1 మధ్య పుట్టినవారైతే స్వీయ బర్త్ సర్టిఫికెట్‌తోపాటు తల్లి లేదా తండ్రి బర్త్ సర్టిఫికెట్లను సైతం సమర్పించాలి.
2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టినవారు మాత్రం ఓటర్ల జాబితాలో చేరాలంటే సెల్ఫ్ బర్త్ సర్టిఫికెట్‌తో పాటు తల్లి, తండ్రి (ఇద్దరివీ) బర్త్ సర్టిఫికెట్లను సమర్పించాలి. దీనికి తోడు ఈసీ పేర్కొన్న 12 రకాల డాక్యుమెంట్లలో ఒకటి లేదా కొన్నింటిని గుర్తింపు కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 2002-2004 ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నట్లయితే ఈ గుర్తింపు కార్డులు లేదా సర్టిఫికెట్ల అవసరం లేకుండా ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటికి సంబంధించిన వివరాలను ఐడీ కార్డుల రూపంలో సమర్పిస్తే సరిపోతుంది.
మ్యాపింగ్ వర్సెస్ అన్ మ్యాపింగ్ ఇష్యూ
రాష్ట్రంలో సర్ ప్రక్రియకు ముందు బీఎల్వోలు నిర్వహించిన ప్రీ-ఎక్సర్‌సైజ్‌లో 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది 65% లోపేనని సీఈఓ (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలోని మొత్తం 3.39 కోట్ల మంది ఓటర్లలో 2.12 కోట్ల ఓటర్ల వివరాలు మాత్రమే మ్యాపింగ్ అయ్యాయని, మిగిలిన 1.26 కోట్ల మంది వివరాలు ఆ జాబితాకు, ఇప్పుడున్న 2025 ఓటర్ల లిస్టుకు మ్యాచింగ్ కావడం లేదని సమాచారం. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దాదాపు 28 లక్షల మంది ఓటర్ల వివరాలు మ్యాచ్ కాలేదు.
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లతో పోలిస్తే ది దాదాపు 22.5%. సిటీకి ఆనుకుని ఉన్న మల్కాజిగిరి జిల్లాలో 19.50 లక్షల (15.41%), రంగారెడ్డి జిల్లాలో 19 లక్షల (14.98%) ఓటర్ల పేర్లు, వివరాలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. అందుకే అవి ‘అన్ మ్యాపింగ్’ కేటగిరీలోకి వెళ్లాయి. ఓవరాల్‌గా చూస్తే రాష్ట్రంలోని అర్బన్ ఓటర్లలో దాదాపు సగం మంది పేర్లు మ్యాపింగ్ కాలేదు. మ్యాపింగ్ కాని ఓటర్లంతా వారి తల్లిదండ్రులు లేదా బంధువుల పేర్లు, పుట్టినతేదీ, ఇతర ఆధారాలను, వారితో ఉన్న రిలేషన్‌ను ప్రూవ్ చేసే ఆధారాలు లేదా సర్టిఫికెట్లను బీఎల్వోలకు ఇవ్వడం తప్పనిసరి.
పార్టీల భవిష్యత్తు సవాల్
‘సర్’ ప్రక్రియ రాజకీయ పార్టీలకు చెమటలు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు పార్టీ లీడర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడి అవగాహన కల్పించింది. గాంధీ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నది. బూత్ లెవల్ ఏజెంట్లకు, కేడర్‌కు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ఇన్‌చార్జి మంత్రులు ట్రెయినింగ్ ఇస్తారు. ఓటర్ల జాబితాలను ఇంటింటికీ ధృవీకరించడం, పేర్లు గల్లంతైన వారిని గుర్తించడం, కొత్తగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతను నమోదు చేయించడం, డూప్లికేట్ నమోదులను పరిశీలించడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించింది.
మరోవైపు బీఆర్ఎస్ దూకుడుగా ఉన్నది. కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాలపైనే దృష్టి పెట్టాలన్నారు. సంస్థాగతంగా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, బూత్ స్థాయిలో పార్టీని చైతన్యపరిచేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. పట్టణ ప్రాంతాలు ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నందున హైదరాబాద్ నగరం సహా, శివారు నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టింది.
బీజేపీ, మజ్లిస్ పోటా పోటీ వ్యూహాలు
బీజేపీ వ్యూహం భిన్నంగా ఉంది. ‘సర్’ ప్రక్రియకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ బూత్ కమిటీలను యాక్టివ్ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో యువ ఓటర్లు, ఫస్ట్ టైమ్ ఓటర్లు, కొత్త కాలనీల్లోని కుటుంబాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్‌కు గ్రామీణ ప్రాంతాల్లో బలం పెరిగిందని భావిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఇప్పటికీ చెక్కుచెదరలేదని బీఆర్ఎస్ నమ్ముతోంది. రాష్ట్ర రాజకీయాలను ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీగా మార్చాలన్న లక్ష్యంతో బీజేపీ ప్లాన్ చేస్తున్నది. మజ్లిస్ పార్టీ చురుకుగా స్పందిస్తున్నది.
లక్షలాది మంది ఓటర్లను ‘అనామలీస్’ (తేడాలు) పేరుతో పక్కన పెట్టడంపై స్పష్టత ఇవ్వాలని సీఈఓను కోరింది. రాష్ట్రంలో అందుబాటులో లేని పత్రాలను అడగడం సరికాదంటున్నది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు వంటి పత్రాలను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీ ‘బోగస్ ఓట్ల ప్రక్షాళన’గా చెప్తున్నా నిజమైన ఓటర్ల పేర్లను తొలగించకూడదని సీఈఓను రాతపూర్వకంగా కోరింది. ‘సర్’ ప్రక్రియకు నాలుగు పార్టీలూ వ్యూహాలు రచించాయి.
సర్ కోసం ఈసీ పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులు ఇవే:
•కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన గుర్తింపు (ఐడీ) కార్డులు
•ఐడీ కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసినవి)
•రాష్ట్ర ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్ఐసీ/ప్రభుత్వరంగ సంస్థలు 1987 జులై 1కు ముందు జారీచేసిన ఐడీ కార్డు లేదా సర్టిఫికెట్
•స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వం లేదా ఆస్పత్రి జారీచేసిన బర్త్ సర్టిఫికెట్
•పాస్‌పోర్ట్
•యూనివర్సిటీ లేదా బోర్డు జారీ చేసిన మెట్రిక్యులేషన్/ఎడ్యుకేషన్ సర్టిఫికెట్
•రాష్ట్ర సంస్థ జారీచేసిన పర్మినెంట్ రెసిడెంన్స్ సర్టిఫికెట్
•అటవీ హక్కుల సర్టిఫికెట్
•సంబంధిత అధారిటీ జారీచేసిన క్యాస్ట్ సర్టిఫికెట్
•నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ) సర్టిఫికెట్ (వర్తించే చోటనే)
•రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీచేసిన ఫ్యామిలీ రిజిస్టర్ డాక్యుమెంట్
•ఆధార్ కార్డు (తప్పనిసరి కాదు.. ఆప్షనల్ మాత్రమే)
రాష్ట్రంలో ‘సర్’ షెడ్యూలు ఇదీ :
జూన్ 25 – జులై 24 : ఇంటింటికీ తిరిగి బీఎల్వోల వివరాల సేకరణ
జులై 31 : ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
జులై 31-ఆగస్టు 30 : అభ్యంతరాల, ఫిర్యాదుల సమర్పణ
సెప్టెంబర్ 28 : ఈ తేదీ లోపు అభ్యంతరాల, ఫిర్యాదులకు పరిష్కారం
అక్టోబర్ 1 : ఓటర్ల తుది జాబితా విడుదల

