కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ మృతిపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణది రెడ్ బుక్ రాజ్యాంగం హత్యేనని అమర్‌నాథ్ ఆరోపించారు. సాయికృష్ణ అనే యువకుడిని అన్యాయంగా చంపి కాల్చేసి బూడిద కూడా దొరక్కుండా చేశారన్నారు. 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘోరం ఎక్కడా జరగలేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో లోకేశ్ ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం నడవదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందన్నారని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధపడి ఉండాల్సిందేనని లోకేశ్ హెచ్చరించారని తెలిపారు. ఆరోజు నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్నతి చేతగాని ప్రభుత్వం, చేతకాని సీఎం, చేతకాని హోం మినిస్టర్, చేతకాని పోలీస్ వ్యవస్థ ఉన్నదని విమర్శించారు. దీనికి రాష్ట్ర ప్రజలంతా తలదించుకోవాల్సి వస్తోందని అమర్‌నాథ్ అన్నారు.

