Mobile Popup Ad
Mobile Popup Ad

ఈ రకం వేస్తే కొనం.. రైతుల‌కు మిల్ల‌ర్ల షాక్‌..!

కలం, నల్లగొండ బ్యూరో : వానాకాలం పంట సీజన్ ప్రారంభానికి ముందే ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో అన్నదాతలకు రైస్ మిల్లర్లు షాక్ ఇచ్చారు. కొన్నాళ్లుగా దిగుబడి ఎక్కువగా వస్తుందనే ఆశతో రైతులు కేఎన్ఎం 12510 వరి రకం (KNM 12510 Paddy Variety) సాగు చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడ (Miryalaguda) రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆ రకం వేయవద్దని తేల్చి చెప్పింది. వచ్చే సీజన్‌లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకాన్ని పండించొద్దని, ఒకవేళ సాగు చేస్తే కొనుగోలు చేయబోమని స్పష్టంచేసింది. ఈ నిర్ణయాన్ని అసోసియేషన్ రాష్ట్ర నేతలు అధికారికంగా ప్రకటించడం గమనార్హం.

జనం తినట్లేదని..

గత ఖరీఫ్ సీజన్ లో కేఎన్ఎం 12510 రకం ఉమ్మడి జిల్లాలో విస్తారంగా సాగైంది. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, అసలు సమస్య మిల్లింగ్ తర్వాతే మొదలైందని మిల్లర్లు చెబుతున్నారు. హెచ్ఎంటీ, జై శ్రీరామ్, చింటూ వంటి సంప్రదాయ సన్నరకాలతో పోలిస్తే కేఎన్ఎం 12510 రకానికి ఆ స్థాయి నాణ్యత లేదని, ఈ బియ్యంతో వండిన అన్నం మెత్తగా, ముద్దగా ఉంటుందని, త్వరగా పాడైపోతుందంటున్నారు. ఓపెన్ మార్కెట్ లో వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నారు. అయితే.. రైతులు కూడా సాధారణంగా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలనే పండించేందుకు ఆసక్తి చూపుతారు. పెరుగుతున్న సాగు ఖర్చులు, ఎరువుల ధరలు రైతులను అధిక ఉత్పాదకత కలిగిన విత్తనాల కోసం వెతికేలా చేస్తున్నాయి. ఒకవేళ దిగుబడి ఎక్కువ వస్తే మార్కెటింగ్ సమస్యలను ప్రభుత్వం లేదా కొనుగోలు సంస్థలు పరిష్కరిస్తాయని రైతులు భావిస్తారు. ఇప్పుడు సాగు ప్రారంభానికి ముందే కొనుగోలు చేయబోమని మిల్లర్లు ప్రకటించడం రైతులను అయోమయంలోకి నెట్టేసింది.

బోనస్ లిస్టులోనూ లేదు

రైస్ మిల్లర్ల నిర్ణయానికి టెక్నికల్ పరమైన కారణాలు కూడా తోడయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా ఎంపిక చేసిన ఎనిమిది ప్రధాన విత్తన రకాల జాబితాలో కేఎన్ఎం రకం లేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటిస్తుండగా.. 33 రకాల సన్న వంగడాలను అధికారికంగా గుర్తించి జాబితాను విడుదల చేసింది. మార్కెట్ లో ప్రైవేట్ కంపెనీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు తెచ్చిన వందలాది రకాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం కేవలం ఈ 33 రకాలకే బోనస్ ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో కేఎన్ఎం 12510కు చోటు దక్కలేదు. అటు ఓపెన్ మార్కెట్ లో మిల్లర్లు కొనరు.. ఇటు ప్రభుత్వ రూల్స్ మేరకు బోనస్ కూడా దక్కే చాన్స్ లేదు. మరోవైపు రైతులు నష్టపోకుండా, మిల్లర్లు ఇబ్బందులు పడకుండా, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తున్నది.

ముందే చెబుతున్నాం.. నష్టపోకండి

పంట వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే, సీజన్ ముందే తాము అప్రమత్తం చేస్తున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై జిల్లా కలెక్టర్లతో పాటు అధికార యంత్రాంగానికి కూడా అధికారికంగా సమాచారం అందించారు. బియ్యం అమ్ముడుపోక గిడ్డంగుల్లోనే నిల్వ ఉండిపోతున్నాయని, దీనివల్ల మిల్లర్లు భారీగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. మార్కెట్ లో డిమాండ్ లేని పంటను పండించి రైతులు, మిల్లర్లు ఇద్దరూ నష్టపోవడం కంటే కస్టమర్ కోరుకునే నాణ్యమైన రకాలను పండించడమే మంచిదని అసోసియేషన్ పేర్కొంది.

పండించే రైతుల ఇష్టమంటున్న మిల్లర్లు

కేఎన్ఎం 12510 రకాన్ని కొనమని, ఒకవేళ రైతులు పండిస్తే వాటిని ప్రభుత్వానికి అమ్ముకుంటారా.. లేక ప్రైవేట్‌గా అమ్ముకుంటారా అనేది వారి ఇష్టమని మిల్లర్లు స్పష్టం చేశారు. దీంతో విత్తనాలు వేసే దశలోనే రైతులు సందిగ్ధంలో పడే పరిస్థితులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఉమ్మడి జిల్లాలో రైతులు విత్తనాలు కొనే ముందే ఈ విషయాన్ని గమనించి, మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఇతర సన్న రకాలను సాగు చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>