కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి (Nandini Sidha Reddy)కి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే అత్యున్నత సాహిత్య పురస్కారం ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025’ దక్కడం పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నందిని సిధారెడ్డిని అభినందిస్తూ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’కు (Animesha) ఈ అవార్డు రావడం గొప్ప విషయమని కొనియాడారు.
తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిధారెడ్డి (Nandini Sidha Reddy) అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేశారని.. ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని స్వంతం చేసుకున్నారని కొనియాడారు.
Read Also: ఏప్రిల్ 1 నాటికి ఈ-ఆఫీసులుగా ప్రభుత్వ కార్యాలయాలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Follow Us On : WhatsApp

