Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు లేదు..అంబులెన్స్ రాదు : ఇది గిరిజనుల గోడు!

కలం, ఆదిలాబాద్ బ్యూరో : దట్టమైన అడవి. కాలిబాటలే దారులు. కర్రలతో నిర్మించిన వంతెనలే వాగులు దాటే మార్గాలు. కర్రల స్తంభాల ద్వారానే విద్యుత్ సరఫరా. అనారోగ్యం వస్తే ఎడ్లబండ్లే అంబులెన్స్‌లు. ఇప్పటికీ నిర్మల్ (Nirmal) జిల్లాలోని మారుమూల గూడేల్లోని గిరిజనుల దుర్భర పరిస్థితులు ఇవి. పెంబి మండలం ఎంగ్లాస్‌పూర్, వసుపల్లి, దోందరి, చిత్రగూడ, చిత్రుగూడ, నాయకపుగూడ, ఒడ్డుగూడ తదితర గూడేలు దట్టమైన అడవిలో ఉండగా మండల కేంద్రంతో సరైన రోడ్డు కనెక్టివిటీ లేదు. రాళ్లు, రప్పలతో కూడిన దారుల్లోనే గిరిజనులు ప్రయాణించాల్సి వస్తుంది. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోగా నిత్యావసరాలకు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. వానాకాలం వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో గూడేలకు ప్రపంచంతో సంబంధాలు కట్ అవుతాయి. దోందరి సమీపంలోని వాగులపై గిరిజనులు కర్రలతో తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసుకుని వాటిపైనే ప్రయాణిస్తున్నారు. వాటిపై భయం భయంగా ప్రయాణించాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రికి వెళ్లడం పెద్ద సవాల్

వైద్య సేవల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి చేరుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా గర్భిణులు ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు లేక ఎడ్లబండ్లపైనే తరలిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రసవాలు జరిగిన ఘటనలు ఉన్నాయని, కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. మరోవైపు పోడు భూముల్లో సాగు చేస్తున్న తమను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీల అమలు చేసేనా..?

గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల కలెక్టర్ భవేష్ మిశ్రా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బైక్ గూడేల్లో పర్యటించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, పోడు భూములు, మొబైల్ నెట్‌వర్క్, వంతెనల నిర్మాణం వంటి సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. వాగులపై ఇనుప వంతెనలు నిర్మిస్తామని, రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గిరిజనులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే హామీలు కార్యరూపం దాల్చి, అడవిబిడ్డల జీవితాల్లో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికైనా మారుమూల గూడేల్లో గిరిజనుల కష్టాలు తీరాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>