కలం, ఆదిలాబాద్ బ్యూరో : దశాబ్దాలుగా చీకటి గూడెం. గిరిజన బిడ్డల బతుకుల్లో అంధకారం. గుడ్డి దీపాలే దిక్కు. ఆ దీపాల కిందే బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తుండగా.. రాత్రిపూట గడప దాటితే పాములు కాటేస్తాయనే ప్రాణభయం. ఆదివాసీ గూడేనికి అటవీ అధికారులు ఎందుకు అడ్డం తిరుగుతున్నారు? అంధకారంలోని ఆదివాసీ గూడెంపై ప్రత్యేక కథనం. నిర్మల్ (Nirmal) జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత (Middechinta) ఆదివాసీ గూడెం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని గూడెంలో సుమారు 200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. గూడెంలో కనీస విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ప్రపంచం డిజిటల్ యుగంలో దూసుకుపోతుంటే, గూడెంలోని ఆదివాసీ కుటుంబాలు దశాబ్దాలుగా చీకటిలోని మగ్గిపోతున్నాయి. గూడెనికి సరైన రోడ్డు లేకపోవడం, విద్యుత్ సదుపాయం లేక గిరిజనులు బతుకులు నానాటికీ దుర్భరంగా మారుతున్నాయి. సాయంత్రం అయిందంటే గూడెం అంధకారంలోకి పోతుంది. ఇంటి గడప దాటాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అడవి కావడంతో తరచూ పాములు ఇళ్లలోకి చొరబడి ప్రాణభయాన్ని కలిగిస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుడ్డి దీపాల కిందే బతుకు
ఇప్పటికీ విద్యుత్ లేకపోవడంతో గిరిజన కుటుంబాలు గుడ్డి దీపాలనే ఆధారంగా చేసుకుని బతుకుతున్నాయి. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట వంట పనులు, ఇంటి పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తలకు బ్యాటరీ లైట్లు కట్టుకుని పనులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ‘ చీకట్లో ఏం తింటున్నామో, ఎలా బతుకుతున్నామో కూడా తెలియని పరిస్థితి. ప్రతి రాత్రి భయంతోనే గడుస్తుంది’ అని గిరిజన మహిళ లీలా బాయి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లేక గిరిజన విద్యార్థుల చదువులు కూడా దెబ్బతింటున్నాయి. సరైన వెలుతురు లేకపోవడంతో చదువుపై ప్రభావం పడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. తమ భవిష్యత్ అంధకారంగా మారుతుందని వాపోతున్నారు.
అయిల్ ఇంజన్లతోనే సాగు
గిరిజన రైతులు ఇంకా పాత పద్ధతులకే పరిమితమయ్యారు. పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న, కూరగాయల సాగు చేస్తున్నా కానీ, విద్యుత్ సౌకర్యం లేక రైతులు ఆయిల్ ఇంజన్లతోనే బావుల నుంచి నీటిని పంటలకు అందిస్తున్నారు. ఆయిల్ ఇంజన్ల నిర్వహణకు భారీగా డీజిల్ అవసరమవుతుండడంతో ఆర్థిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం వేల రూపాయలు డీజిల్‌కే ఖర్చవుతుందని చెబుతున్నారు. పంటల ద్వారా వచ్చే ఆదాయం అంతా డీజిల్ కే సరిపోతుందని రైతు అత్రం మాణిక్‌రావు చెబుతున్నారు. సాగు చేసినా లాభం లేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ నిబంధనల పేరిట అడ్డంకులు?
గిరిజనులు దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతం కావడంతో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో అటవీ శాఖ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని వాపోతున్నారు. దశాబ్దాలుగా చీకట్లోనే జీవిస్తున్న తమ గూడెనికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, రోడ్డు నిర్మించాలని మిద్దెచింత గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక నరకయాతన అనుభవిస్తున్నామని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

