కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మళ్లీ ఎవరూ గడీల పాలన కోరుకోరని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా పిప్రిలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ (BRS) పాలన, పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు మాయగాళ్లు మారీచుల రూపంలో వస్తున్నారని విమర్శించారు. ఇటీవల కొందరు కొడంగల్, మహేశ్వరం వెళ్లారని, మార్కెట్ యార్డు కట్టలేదని మాట్లాడుతున్నారని చెప్పారు. మరి పదేళ్లు అధికారంలో ఉన్న మీరెందుకు మార్కెట్ యార్డ్ కట్టలేదని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో గత పాలకులు చేయలేని ఎన్నో పనులు తమ ప్రభుత్వం చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా చేయాల్సినవి కూడా ఎన్నో పనులు ఉన్నాయన్నారు. అభివృద్ధికి అడ్డుపడేందుకు ఊరూరా తిరగడం కాదని, కొంత ఓపిక ఉండాలని, సంయమనం పాటించాలని సూచించారు. గత పాలకులు కొంచమైనా ఆలోచన చేయాలని హితవు పలికారు. వాళ్లకు ఎంతసేపు ఆటంకాలు సృష్టించడం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఇప్పటికే ప్రజలు వాళ్ల బాగోతం చూశారని, మళ్లీ ఆ పాలన కావాలని ఎవరూ కోరుకోరని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా ప్రభుత్వమే వస్తుందని, 2034 వరకు అధికారంలో కొనసాగుతామని ధీమా వ్యక్తం చేశారు. 2034 లోగా ఆదిలాబాద్‌ను అత్యంత అభివృద్ధి చెందిన పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక వాడగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

