కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (Yellandu) మండలం కొమరారం గ్రామంలో ఓ ఆంబోతు మంగళవారం మరణించింది. వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈ మూగజీవానికి స్థానికులు చికిత్స అందించినా, పరిస్థితి విషమించడంతో కోలుకోలేక ప్రాణాలు విడిచింది.
విడదీయరాని అనుబంధం..
గతంలో గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా ఈ ఆంబోతును తీసుకువచ్చారు. మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సహకారం అందించారు. అప్పటి నుంచి ఈ ఆంబోతుతో గ్రామస్థులకు విడదీయరాని బంధం ఏర్పడింది.
గ్రామ దేవత ఉత్సవాల నాటి జ్ఞాపకంగా ఉన్న ఆంబోతు అకస్మాత్తుగా మృతి చెందడంతో ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తమలో ఒకరిగా ఉంటూ వస్తున్న ఈ మూగజీవానికి ఊరంతా కలిసి కలిసి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.

