కలం, వెబ్ డెస్క్: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా బుట్టలుబుట్టలుగా మామిడిపండ్లు కనిపిస్తున్నాయి. మనకు తెలిసిన మామిడి రకాలు (Mango Varieties) కొన్నే.. మనకు అందుబాటులో ఉండే రకాలు పరిమితమే. అయితే ఎన్నో రకాల అరుదైన మామిడి పండ్లు ఉన్నాయి. వాటి ధర కూడా అధికం. మన దేశంలో అత్యంత ఖరీదైన 7 రకాల మామిడి పండ్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా అందరికీ తెలిసిన రకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నప్పటికీ, భారత్‌లో కొన్ని అరుదైన, ప్రత్యేక పద్ధతుల్లో పండించే లగ్జరీ మామిడి రకాలు కూడా ఉన్నాయి. అధిక ధరల కారణంగా ఈ పండ్లు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. స్టేటస్ సింబల్స్‌గా మారిపోయాయి.
మామిడి రకాలు (Mango Varieties):
మియాజాకి ఎంతో కాస్ట్లీ
మనదేశంలో అత్యంత ఖరీదైన మామిడి రకాలలో జపాన్‌కు చెందిన మియాజాకి మామిడి మొదటి స్థానంలో నిలుస్తోంది. గాఢ ఎరుపు రంగులో, ప్రత్యేకమైన తీపి రుచితో ఈ పండ్లు ఉంటాయి. మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో అరుదుగా ఈ రకం మామిడి పండిస్తున్నారు. ధర కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతోంది.
నవాబుల కాలం నాటి పండు ఇది..
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందిన కోహితూర్ మామిడి నవాబుల కాలం నుంచి ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం అత్యంత అరుదుగా లభించే ఈ రకం ఒక్క పండు రూ.3,000 నుంచి రూ.12,000 వరకు అమ్ముడవుతోంది.
నూర్‌జహాన్ ప్రత్యేకత ఇదే..
మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్ ప్రాంతంలో పండించే నూర్‌జహాన్ మామిడి భారీ సైజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక్క పండు 2 నుంచి 3 కిలోల వరకు బరువు ఉండగా, ధర రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉంటుంది.
ఇమామ్ పసంద్.. కేరాఫ్ హైదరాబాద్
దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన ఇమామ్ పసంద్ లేదా హిమాయత్ మామిడి హైదరాబాద్‌లో ఎంతో ప్రాచుర్యం పొందింది. మృదువైన గుజ్జు, ప్రత్యేక రుచితో ప్రసిద్ధి చెందిన ఈ రకం కిలోకు రూ.500 నుంచి రూ.1,000 వరకు అమ్ముడవుతోంది.
ఆల్ఫోన్స్ .. ఈ పండు రేంజ్ వేరు
మహారాష్ట్రలోని రత్నగిరి, దేవగడ్ ప్రాంతాల్లో పండించే ఆల్ఫోన్సో (హాపస్) మామిడి దేశవ్యాప్తంగా ప్రీమియం రకంగా గుర్తింపు పొందింది. దీని సువాసన, క్రీమీ గుజ్జు వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సీజన్, నాణ్యత ఆధారంగా డజన్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ధర ఉంటుంది.
సింధ్రీ రకానికి అంతర్జాతీయ మార్కెట్
గుజరాత్-రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో లభించే సింధ్రీ మామిడి పొడవైన ఆకారం, రసాలైన గుజ్జుతో ప్రత్యేకతను సంపాదించింది. ఈ రకం ఒక్క పండు రూ.3,000 వరకు ధర పలుకుతోంది.
కేసర్
గుజరాత్‌లోని గిర్, జునాగఢ్ ప్రాంతాల్లో పండించే కేసర్ మామిడి కుంకుమ రంగు గుజ్జు, సువాసనతో ప్రసిద్ధి చెందింది. ఇది ప్రీమియం రకంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ను సంపాదించింది. ఖరీదైన ఈ మామిడి రకాల ఉత్పత్తి కూడా పరిమితమే. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, సాగు విధానంలో ఉండే మెలకువలు అధిక డిమాండ్ కారణంగా ఈ మామిడి పండ్లు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
Read Also: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్ర ముంచుకొస్తుందా.. అయితే బీఅలర్ట్
Follow Us On: Instagram

