కలం, వెబ్ డెస్క్ : కేవలం రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు అనుమతి ఇచ్చి తనకు ఇవ్వకపోవడంలోని ఆంతర్యమేంటో స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై గౌరవంతోనే తాను అమెరికా పర్యటనను రద్దు చేసుకుని లండన్ నుంచి తిరిగి వచ్చేశానని అన్నారు. నాలుగు రోజుల లండన్ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న సీఎం.. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతో పలు కీలక కామెంట్లు చేశారు. గుజరాత్ ప్రభుత్వం వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించడానికి ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, సిలికాన్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, అదే తరహాలో తెలంగాణకు సైతం పెట్టుబడులు తీసుకురావడానికి తాను అమెరికా పర్యటనకు శ్రీకారం చుడితే విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదన్నారు.
ప్రతిపాదనలకు అనుగుణంగా అమెరికా టూర్ (CM Revanth Reddy US Tour) లేదన్న కారణంతోనే అనుమతి ఇవ్వలేదని విదేశాంగ శాఖ చెప్తున్నదని, దీని వెనక ఉద్దేశం తెలంగాణకు పెట్టుబడులు రాకూడదన్న ఆలోచనే అని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నందునే తన అధికారిక పర్యటనను కేంద్రం అడ్డుకున్నదని ఆరోపించారు. మోదీ దేశం మొత్తానికి ప్రధానిగా కాకుండా గుజరాత్‌కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలుగుతున్నదని సీఎం ఆరోపించారు. తనకు అనుమతి ఇవ్వకపోయినా అధికారులు షెడ్యూలు ప్రకారం అక్కడ పర్యటనను కొనసాగిస్తున్నారని తెలిపారు.

