22ఏపై పోరుబాట.. భూ బాధితులతో గంగుల ధర్నా

కలం, కరీంనగర్ బ్యూరో: రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ అర్హత కలిగిన పట్టా భూములను (Patta Lands) నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని కరీంనగర్ (Karimnagar) ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన గంగుల కమలాకర్ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

22ఏ సెక్షన్ ఉద్దేశం వేరు

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకే రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని 22ఏ సెక్షన్‌ను ఉద్దేశించారని తెలిపారు. అయితే ఈ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 22ఏ(2) నిబంధనల ప్రకారం భూములను నిషేధిత జాబితాలో చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రక్రియను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని గంగుల కమలాకర్ ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై సమగ్ర విచారణ జరిపి భూ యజమానులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఊర్లకు ఊర్లే 22ఏ జాబితాలో..

కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల తెలిపారు. ఈ ప్రాంతాలలో వేలాది మంది భూ యజమానులు సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, ఇతర కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భూముల రికార్డులను ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూముల రికార్డులను సరిచేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాలలో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్‌ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, భూ బాధితులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>