కొండా సురేఖపై వేటు తప్పదా?.. గాంధీ‌భవన్‌లో తర్జన భర్జనలు

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ (Konda Surekha Controversy) వ్యవహారం ఇటు ప్రభుత్వంలో, అటు కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా తయారైంది. యాక్షన్ తీసుకోవడంలో పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్షణం నిర్ణయం తీసుకోవడమా?.. లేక ఆచితూచి అడుగులేయడమా? అనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇద్దరు మంత్రులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతుండడంతో వారి అభిప్రాయాల మేరకు నిర్ణయాలుంటాయా?.. లేక క్రమశిక్షణా కమిటీ ఇచ్చే నివేదికకు తగ్గట్టు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందా? అనేది కీలకంగా మారింది.

సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే జరగబోయే పరిణామాలు సైతం పార్టీ మదిలో ఉన్నాయి. బీసీ సామాజికవర్గం, మహిళ కావడంతో పార్టీపై పడే ప్రభావాన్ని కూడా పీసీసీ అంచనా వేస్తున్నది. లండన్ పర్యటన ముగించుకుని సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటున్న సీఎం.. ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఆయననే టార్గెట్గా సురేఖ కూతురు సుష్మిత పరుష పదజాలంతో విమర్శలు, ఆరోపణలు గుప్పించడం నాలుగురోజులుగా రాష్ట్రంలో హీట్ పుట్టిస్తున్నది. తల్లిగా, మంత్రిగా ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిన కొండా సురేఖ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి నిలదీతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆమెపై తీసుకునే చర్యలు ఏమిటన్నది చర్చనీయాంశమయ్యాయి.

ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత పరుష పదాలతో, ఏకవచనంతో కామెంట్లు చేయడాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. తల్లిగా కొండా సురేఖ మందలించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నోటీసుపైనా కొండా సురేఖ వివరణ సంతృప్తికరంగా లేదన్న వాదన గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్నది. మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందేనని, పార్టీ తరఫున కూడా కఠిన చర్యలు ఉండాలని ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మరో అరడజను మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సైతం సహచర మంత్రి కొండా సురేఖ తీరును తప్పుపట్టారు. పార్టీ గీత దాటినవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సుష్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి కూడా వ్యాఖ్యానించారు. “ఇంతకాలం కాపాడాను.. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు.” అంటూ పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ సైతం మీడియాతో చిట్ చాట్‌లో క్లారిటీ ఇచ్చారు. అయితే.. సురేఖపై తీసుకునే చర్యల విషయంలో మాత్రం కాంగ్రెస్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు. తక్షణ నిర్ణయమా? ఆచితూచి స్పందించాలా? అనేదానిపై కసరత్తు చేస్తున్నారు. తొలగిస్తే జరిగే పరిణామాలపై, కొనసాగిస్తే తలెత్తే పరిణామాలపై అంచనా వేసుకుంటున్నారు.

పార్టీ క్రమశిక్షణకే కీలకంగా నిర్ణయం

కొండా సురేఖ విషయంలో ముఖ్యమంత్రి, లేదంటే ఏఐసీసీ హైకమాండ్ తీసుకునే నిర్ణయం మొత్తం పార్టీకి సంబంధించిన అంశంగా ఉండనున్నది. పార్టీ క్రమశిక్షణ తప్పినవారిపై స్థాయికి అతీతంగా నిర్ణయం ఉంటుందనే మెసేజ్ వెళ్లాలన్న వాదన వినిపిస్తున్నది. కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింతమందికి.. పార్టీకి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ధైర్యం వచ్చినట్లవుతుందన్న వాదనా ఉన్నది. తక్షణం మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారా?.. ఏఐసీసీ నిర్ణయం తీసుకునేంత వరకు వెయిటింగ్‌లో పెడతారా?.. పోర్ట్ఫోలియోలన్నీ తీసేసి ఏ శాఖా ఇవ్వకుండా కొనసాగిస్తారా?.. ఇలాంటి అభిప్రాయాలూ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా అది ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంగా కాక హైకమాండ్ తీసుకున్నదిగా ఉండాలన్నదే మెజారిటీ నేతల అభిప్రాయం. కానీ, నిర్ణయం మాత్రం సంస్థాగతంగా క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవనే సందేశం వెళ్ళాలని కోరుతున్నారు.

సోషల్ జస్టిస్, మహిళ కోణం నుంచి ఆలోచన

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించాల్సిన నిర్ణయం వెలువడడానికి ముందే ఆమె సామాజికవర్గం, మహిళ అనే కోణం నుంచి లోతుగా ఆలోచించడంపైనా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. సోషల్ జస్టిస్ ప్రిన్సిపుల్‌కు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా సొంత పార్టీలోనే విమర్శలకు తావులేని తీరులో ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. పరుష వ్యాఖ్యలు చేసింది సుష్మిత అయినందున సురేఖపై చర్యలు తీసుకోవాల్సిన అవసరమేమున్నదనే చర్చకు ఆస్కారం లేకుండా నిర్ణయం జరిగే అవకాశమున్నది. బీసీ సంఘాలు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చర్చను రేకెత్తించడం, స్వయంగా సుష్మితే బీసీ మహిళా నేత అంటూ కొండా సురేఖను ప్రస్తావిస్తుండడంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరగకుండా నేతలు అన్ని వైపుల నుంచీ ఆలోచిస్తున్నారు. కొండా సురేఖ విషయంలో తీసుకోబోయే నిర్ణయం వ్యక్తిగా ఆమెకు సంబంధించిన అంశంగా కాకుండా మొత్తం పార్టీలోనే గీత దాటితే వేటు తప్పదనే మెసేజ్ ఇవ్వాలన్నది మెజారిటీ లీడర్ల అభిప్రాయం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>