పెట్టుబడులపై కేంద్రం కుట్ర.. గుజరాత్‌కు ఓకే.. తెలంగాణకు నో!

కలం, తెలంగాణ బ్యూరో : అమెరికాలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పొలిటికల్ క్లియరెన్స్ కేంద్రం నిరాకరించడం రాష్ట్ర పెట్టుబడులు (Telangana Investments), అభివృద్ధి, కొత్త పరిశ్రమల స్థాపన తదితరాలపై ఎలాంటి ప్రభావం పడనున్నదనే చర్చ సచివాలయ వర్గాల్లో మొదలైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్‌కు అమెరికాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి స్వయంగా ఆహ్వానించాలని సీఎం భావించారు. కానీ, పర్యటనకు అనుమతి రాకపోవడంతో ఆ సమావేశాలు రద్దయ్యాయి. ఆల్టర్నేట్‌గా ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నది త్వరలో డిసైడ్ కానున్నది. అయితే, పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరణతో అక్కడి ఇన్వెస్టర్లకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సంబంధాలు లేవా?.. రాజకీయ స్థిరత్వం లోపించిందా?.. ఇలాంటి కొత్త డిస్కషన్ స్టార్ట్ అయితే అది రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికల సక్సెస్‌పై ఎఫెక్ట్ చూపుతుందన్నది పారిశ్రామిక విభాగం ఆందోళన.

ప్రత్యేక పాలసీలున్నా..!

వాతావరణం, మౌలిక సౌకర్యాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్-రోడ్ కనెక్టివిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక పాలసీ, రాయితీలు.. ఇలాంటి ఎన్ని అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నా పొలిటికల్ స్టెబిలిటీ అంశం కూడా అమెరికా పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు ఆలోచనల్లో ఒకటిగా ఉంటుందని స్టేట్ ఇండస్ట్రీస్-ప్రమోషన్స్ విభాగ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రికి పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో దాని ప్రతికూల ప్రభావం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో రిఫ్లెక్ట్ అవుతుందని, దాన్ని చక్కిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని, ఇన్వెస్టర్లలో విశ్వాసం కలిగేంత వరకు స్తబ్దత కొనసాగే అవకాశం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు, గుజరాత్‌కు తాత్కాలికంగా డైవర్ట్ కావొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ కొన్ని పరిశ్రమలకు హైదరాబాద్‌లోని అనుకూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలకు ఆస్కారం లేకపోవడం, మౌలిక సౌకర్యాలు ఉండడం.. ఇలాంటి అంశాలతో ఆలస్యమైనా ఇక్కడికే వచ్చే అవకాశముంటుందని ఆ వర్గాలు తెలిపాయి.

ఐటీ, డేటా, సెమీ కండక్టర్ రంగాల్లో..!

అనుకూల వాతావరణంతో పాటు ప్రకృతి వనరుల లభ్యత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భూకంపాలు – తుపానులు – సునామీల బాధ లేకపోవడం, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సౌకర్యం.. ఇలాంటివన్నీ తెలంగాణ ప్రత్యేకతలుగా ఉన్నాయి. డేటా సెంటర్లు, ఐటీ పరిశ్రమలు, ఈ రంగాల్లో సర్వీస్ అందించే సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపన, లైఫ్ సైన్సెస్.. ఇలాంటి రకాల పరిశ్రమలన్నింటికీ హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందని, సముద్ర తీరం ఉండే రాష్ట్రాల్లో నెలకొల్పడం అనువుగా ఉండదని ఆ వర్గాలు తెలిపాయి. ఐటీఐఆర్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేసి ఉండకపోతే ఐటీ రంగం మరింత విస్తరించి ఉండేదని, గతంలోనే డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఊపందుకునేవని స్టేట్ ఐటీ అధికారులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీని దృష్ట్యానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సైతం ఐటీఐఆర్ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. సెమీకండక్టర్ పరిశ్రమలకు సైతం హైదరాబాద్ అనుకూలంగా ఉంటున్నందను పర్మిషన్ ఇవ్వాలని కోరినా కేంద్రం ఇవ్వడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పలుమార్లు ప్రస్తావించారు.

గుజరాత్ సీఎంకు క్లియరెన్స్ ఇచ్చి..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చి అమెరికా టూర్‌కు ఇవ్వకపోవడానికి కారణాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రికి క్లియరెన్స్ ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోవడంపైనా గుసగుసలు మొదలయ్యాయి. తెలంగాణకు నిరాకరించడంపై జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తెలంగాణలో ప్రజాదరణను చూరగొనలేక, రాజకీయంగా నిలువరించలేక అభివృద్ధి రూపంలో పెట్టుబడులు రాకుండా ‘పొలిటికల్ క్లియరెన్స్’ లాంటి అంశాల్లో బ్రేకులు వేయడం ఎల్లకాలం సాగదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి నిర్దిష్ట కారణాలను విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొనకపోయినా.. నిర్దిష్ట నిబంధనలకు, ప్రతిపాదనలకు అనుగుణంగా లేవని మాత్రమే వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటున్నందున “అన్ని అంశాలనూ వెల్లడిస్తా…” అని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో బీజేపీ – కాంగ్రెస్ వేడి మరింత పెరిగే చాన్స్ కనిపిస్తున్నది.

రైజింగ్ తెలంగాణ వర్సెస్ వైబ్రెంట్ గుజరాత్

ఐటీ పరిశ్రమలు, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో పాటు బయో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నది. ఇటీవలే అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ‘రైజింగ్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్’ కోసం సీఎం రేవంత్రెడ్డి నాలుగు నెలల ముందే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమెరికా టూర్‌లో ఈ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో భేటీ కావాలనుకున్నారు. కానీ, పొలిటికల్ క్లియరెన్స్ లేకపోవడంతో టూర్ రద్దయింది. ఇదే సమయంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాత్రం ఆగస్ట్ 17 నుంచి న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సిలికాన్ వ్యాలీ (శాన్‌ఫ్రాన్సిస్‌కో) నగరాల్లో పర్యటిస్తూ ఇన్వెస్టర్లతో సమావేశమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ‘వైబ్రెంట్ గుజరాత్’ గ్లోబల్ సమ్మిట్ కోసం పెట్టుబడుల ఆకర్షణపై కసరత్తు చేస్తున్నారు. గుజరాత్‌కు పర్మిషన్ ఇచ్చి తెలంగాణకు ఇవ్వకపోవడంతో ‘రైజింగ్ తెలంగాణ’ వర్సెస్ ‘వైబ్రెంట్ గుజరాత్’ వార్ మొదలైంది.

గుజరాత్‌కు ఓకే.. తెలంగాణకు నో..!

  • ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ వేదికగా ‘రైజింగ్ తెలంగాణ – గ్లోబల్ సమ్మిట్’ జరగనుంది. దీనికోసం అమెరికా టూర్‌లో ఇన్వెస్టర్లను కలిసి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి భావించారు. పొలిటికల్ క్లియరెన్స్ లేకపోవడంతో టూర్ రద్దయింది.
  • గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాత్రం ఆగస్ట్ 17 నుంచి న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సిలికాన్ వ్యాలీలో పర్యటిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే ‘వైబ్రెంట్ గుజరాత్’ గ్లోబల్ సమ్మిట్ కోసం పెట్టుబడుల ఆకర్షణపై కసరత్తు చేస్తున్నారు.
  • గుజరాత్‌ సీఎం అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చి.. తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు మాత్రం ఇవ్వకపోవడంపై అనుమానాలు రాజుకుంటున్నాయి. ‘వైబ్రెంట్ గుజరాత్’ కోసం ‘రైజింగ్ తెలంగాణ’ను దెబ్బతీయాలన్న కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>