కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ!

కలం, తెలంగాణ బ్యూరో: మంత్రి కొండా సురేఖ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి  (CM Revanth Reddy) ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఆసక్తికరంగా మారింది. సాఫ్ట్ నిర్ణయం తీసుకుంటే పార్టీలో ‘ఇష్టారాజ్యం’ ధోరణి మరింత పెరుగుతుందనే ఆందోళన, కఠిన నిర్ణయం తీసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే అంశాలను బేరీజు వేసుకొని డెసిషన్ తీసుకునే అవకాశమున్నది. ఇప్పుడు టఫ్‌గా వ్యవహరించకపోతే భవిష్యత్తులో పార్టీలో క్రమశిక్షణ తప్పుతుందని, అది విపక్షాలకు రాజకీయ అస్త్రంగా మారుతుందన్న ఆందోళన కేడర్‌‌లో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ సిద్ధాంతం ‘సోషల్ జస్టిస్’ పాలసీ, పార్టీలో క్రమశిక్షణ విధానాన్ని బ్యాలెన్స్ చేసేలా సీఎం నిర్ణయం ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండేలా స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలనే డిమాండ్ కూడా వస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం తీసుకునే నిర్ణయం ఉత్కంఠ రేకెత్తిస్తున్నది.

నిర్ణయం సవాలే..

కొండా సుష్మిత నేరుగా సీఎంనే టార్గెట్ చేయడంతో ఎలాంటి చర్యలుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరిస్తే పార్టీలో ఇదొక ట్రెండ్‌గా మారుతుందని, మరోవైపు ‘నాయకత్వ అసమర్థత’ అనే ముద్ర పడే అవకాశముందనేది కొందరి వాదన. నిర్ణయం కఠినంగానే ఉండాలనేది వాళ్ల డిమాండ్. కఠిన నిర్ణయం తీసుకుంటే ఎదురయ్యే రాజకీయ ఇబ్బందులు మరో సవాల్. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కొండా సురేఖ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనేది మరికొందరి వాదన. పార్టీలో నేతల ప్రవర్తన కంట్రోల్‌లో ఉండేందుకు కఠినంగా వ్యవహరించకపోతే అది మరింత ప్రమాదకరమనే వాదనా ఉన్నది. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఆలోచించి సీఎం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. క్రమశిక్షణా కమిటీ, పీసీసీ, ఏఐసీసీ నివేదికల అనంతరం నిర్ణయం హైకమాండ్ నుంచే వెలువడే చాన్స్ ఉన్నది.

నేతలకు స్పష్టమైన మెసేజ్

కొండా సురేఖ విషయంలో సీఎం తీసుకునే నిర్ణయం పార్టీలో లక్ష్మణరేఖ దాటుతున్న నేతలకు మెసేజ్ ఇచ్చేలా ఉండాలన్నది ఒక సెక్షన్ నేతల వాదన. ఆమెను మంత్రివర్గంలో కొనసాగిస్తూనే చర్యల వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి లేదా పీసీసీకి లేదా ఏఐసీసీకి వదిలేస్తే అది సాఫ్ట్ నిర్ణయంగా కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. ‘సీఎంను సవాలు చేసినా చివరికి జరిగేదేమీ ఉండదు..’ అనే మెసేజ్ వెళ్లే ప్రమాదమున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మంత్రివర్గం నుంచి తొలగిస్తూ కఠిన చర్య తీసుకుంటే పార్టీ క్రమశిక్షణ తప్పినవారు ఏ స్థాయిలో ఉన్నా వేటు తప్పదనే బలమైన సందేశం ఇచ్చినట్లవుతుందన్నది నేతల వాదన. అదే సమయంలో వరంగల్ జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్స్, పార్టీలో కొత్త గ్రూపులు తయారయ్యే అవకాశం.. ఇలాంటివీ నిర్ణయానికి కీలకంగా మారనున్నాయి. ఇక నుంచి పార్టీ, ప్రభుత్వం ఎలా ఉండాలనే అంచనాకు తగినట్లుగా ‘సాఫ్ట్ వర్సెస్ హార్డ్’ నిర్ణయం వెలువడే అవకాశమున్నది.

సత్వరమా? ఆచితూచి నిర్ణయమా?

  • మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలే ప్రభుత్వ నిర్ణయాలను, సీఎంను బహిరంగంగా ప్రశ్నించే విధానం కొనసాగితే ప్రతిపక్షానికి ఆయుధంగా మారుతుందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
  • వివాదాలను వ్యక్తుల అంశంగా భావించి పరిష్కరించేకంటే పార్టీకి ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణా ప్రమాణాన్ని రూపొందించడం ఇప్పుడు తక్షణ అవసరంగా మారిందని అంటున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నేత రాజగోపాల్‌రెడ్డి ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు.
  • కొండా సురేఖను కేబినెట్‌లో కొనసాగించాలా? తొలగించాలా? అనేది సీఎం విచక్షణకు సంబంధించిన అంశమే అయినా.. ఆయన తీసుకునే నిర్ణయం ప్రతీకారంతో కూడినదనే భావన కలగకుండా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
  • ఇంకోవైపు ‘చర్య తీసుకునే ధైర్యం సీఎంకు లేదు’ అనే ధోరణి తలెత్తకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవడం పరీక్షగా మారింది.
  • లండన్ నుంచి సీఎం ఆదివారం రాత్రి తిరిగొచ్చిన తర్వాత ఈ విషయానికి ఎలాంటి ముగింపు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది. వెంటనే నిర్ణయం తీసుకుంటారా? లేక ఆచితూచి నిర్ణయం తీసుకుంటారా? అన్నది కీలకంగా మారింది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>