హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు.. లంచాల మత్తులో అధికారులు!

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో (Hyderabad) వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. అనుమతులు లేకుండా, పర్మిషన్లకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, కనీస సెట్‌బ్యాక్ లేకుండా, నాలాలను ఆక్రమించి చేపడ్తున్న అక్రమ నిర్మాణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నాణ్యత లోపం కారణంగా భవనాలు కూలినప్పుడో లేదంటే అక్రమ నిర్మాణమని గుర్తించి కూల్చివేతలు చేపట్టినప్పుడో అధికారులు హడావిడి చేస్తున్నారు. కానీ నిర్మాణాలు పూర్తి కాకముందే అక్రమ కట్టడాలను అడ్డుకోలేకపోతున్నారు. గచ్చిబౌలిలో కేవలం 50 గజాల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా ఐటీ హబ్

అక్రమ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించినప్పటికీ, ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లిన అధికారులు లంచాలు తీసుకొని సైలెంట్‌గా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పశ్చిమ హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న శేరిలింగంపల్లి రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, చందానగర్‌, కొండాపూర్‌ పరిసరాల్లో భారీగా నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణాల నియంత్రణ మున్సిపల్‌ అధికారులకు పెద్ద సవాలుగా మారింది. గతంలో చేపట్టిన ఒక ప్రత్యేక డ్రైవ్‌లో ఐటీ హబ్‌ పరిధిలో 355 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు సమాచారం. వాటిలో శేరిలింగంపల్లి సర్కిల్‌–11లో 161, చందానగర్‌ సర్కిల్‌–12లో 137 నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. అయ్యప్ప సొసైటీ, రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై గతంలో చర్యలు తీసుకున్నారు. అయితే కూల్చివేతలు జరిగిన తర్వాత అదే ప్రాంతాల్లో మళ్లీ అక్రమ నిర్మాణాలు ఎలా పుట్టుకొస్తున్నాయన్నదే అసలు ప్రశ్న.

మొదట నిర్లక్ష్యం.. తర్వాత హడావిడి

అక్రమ నిర్మాణాలను మొదటి దశలోనే అడ్డుకోగలిగితే యజమానికి, కొనుగోలుదారుడికి, ప్రభుత్వానికి నష్టం ఉండదు. కానీ మున్సిపల్ అధికారులు నిర్మాణం పూర్తయ్యే వరకు స్పందించకుండా.. భవనం పూర్తయ్యాక కూల్చివేతకు వెళ్లడం వల్ల రూ.కోట్లల్లో నష్టం జరుగుతున్నది. ఆ అక్రమ నిర్మాణాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన అమాయకులు నిండా మునుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో నాణ్యత లోపాలు, నిబంధనల ఉల్లంఘన కారణంగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలి సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారుల ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయం అధికారులకు తెలియదా? అనుమతి లేకుండా సెల్లార్‌ తవ్వుతున్నప్పుడు గుర్తించలేరా? సెట్‌బ్యాక్‌లు లేకుండా పిల్లర్లు వేస్తున్నప్పుడు ఎవరి దృష్టికి రాదా? అదనపు అంతస్తులు నిర్మిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు స్పందించరు? నాలాలను ఆక్రమించినప్పుడు అధికారుల తెలియదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారులూ బాధ్యులే..

అక్రమ నిర్మాణాలకు బిల్డర్లను మాత్రమే బాధ్యులను చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి ఇచ్చిన అధికారి ఎవరు? ఫైల్‌ పరిశీలించిన అధికారి ఎవరు? సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ చేసినవారు ఎవరు? ఫిర్యాదు వచ్చిన తర్వాత చర్యలు తీసుకోని అధికారి ఎవరు? అనే వివరాలను కూడా బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో బిల్డర్‌తో పాటు సంబంధిత అధికారులను కూడా బాధ్యులను చేస్తేనే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.

ఇలా చేస్తే అక్రమాలకు అడ్డుకట్ట..

  1. ప్రతి మున్సిపల్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాల డిజిటల్‌ జాబితా రూపొందించాలి.
  2. ప్రతి ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ను జీపీఎస్‌, ఫొటో, వీడియో ఆధారాలతో నమోదు చేయాలి.
  3. నిర్మాణ అనుమతి నుంచి పూర్తయ్యే వరకు దశల వారీగా తనిఖీలు నిర్వహించాలి.
  4. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలి.
  5. అక్రమ నిర్మాణానికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి.
  6. ప్రజల ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఆ ఫిర్యాదు స్థితి ఏంటో ఆన్‌లైన్‌లో తెలుసుకునేలా పారదర్శక వ్యవస్థ ఉండాలి.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>