నవాబుపేట అభివృద్ధిపై మంత్రి పొన్నం కీలక హామీ

కలం, కరీంనగర్ బ్యూరో :  కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామాన్ని(Nawabpet Village) అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) అన్నారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో నవాబుపేట రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి కుటుంబం బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విద్యుత్ సమస్యపై తక్షణ చర్యలు

గ్రామంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ఆయిల్‌ పామ్  సాగుతో అధిక ఆదాయం

రైతులు సంప్రదాయ పంటలతో పాటు అధిక లాభాలు అందించే ఆయిల్‌ పామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆయిల్‌ పామ్‌ను పెద్ద ఎత్తున సాగు చేయడం ద్వారా రైతులకు దీర్ఘకాలికంగా మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, సంక్షేమ పథకాలను రైతులు, ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.

సంక్షేమ పథకాలతో గ్రామానికి ప్రయోజనాలు

నవాబుపేటలో ప్రభుత్వ పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. గ్రామంలో 21 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నాయి. మహాలక్ష్మి పథకం కింద 629 మంది గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 754 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోంది. రైతు భరోసా కింద 1,143 మంది రైతులకు రూ.6.90 కోట్లు విడుదల కాగా, రైతు రుణమాఫీ కింద 452 మంది రైతులకు రూ.4.09 కోట్ల ప్రయోజనం చేకూరింది.

రైతు బీమా కింద 12 మందికి రూ.60 లక్షలు అందించారు. గ్రామంలో 519 మందికి సామాజిక భద్రత పింఛన్లు అందుతున్నాయి. గ్రామంలో 1,273 రేషన్ కార్డులు ఉండగా, కొత్తగా 157 రేషన్ కార్డులు మంజూరు చేశారు. మరో 304 మంది పేర్లను రేషన్ కార్డుల్లో నమోదు చేశారు. కళ్యాణలక్ష్మి పథకం కింద 42 మంది లబ్ధిదారులకు రూ.42 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందింది. మూడు సంఘాలకు స్టీల్ బ్యాంకులు అందించడంతో పాటు అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

నవాబుపేట అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నవాబుపేటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో షర్మిల, డీపీవో జగదీశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, గ్రామ సర్పంచ్ గూళ్ల రజిత రాజు, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీవో రామ్మోహనాచారి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>