కలం, వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రి పదవి నుంచి తొలగిస్తుందా? లేదా అనే కొత్త చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదలైంది. ఇన్నాళ్లు కాంగ్రెస్‌లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగిన సురేఖకు పదవికి దూరమైతే, ఇక కొండా దంపతుల రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? మరో రాజకీయ వేదికను ఆశ్రయిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. బీజేపీలో చేరే చాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలు కొండా దంపతులు, వరంగల్ జిల్లా చుట్టే తిరుగుతున్నాయి.
పదవి పోతే బలం ఎంత?
కొండా దంపతుల కూతురు సుస్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే, ఆ తర్వాత రాజకీయంగా దారెటు అనే చర్చ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లోనూ, కొండా వర్గంలోనూ జరుగుతోంది. ఒకవేళ సురేఖను పదవి నుంచి తొలగిస్తే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆమెకు బహిరంగంగా మద్దతు నిలిచే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడితే వారి వెంట ఎంతమంది నేతలు, ప్రజాప్రతినిధులు నడుస్తారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
పరకాల.. గీసుకొండపైనే ఆశలు
కొండా కుటుంబానికి పరకాలతో కొన్నేళ్లుగా విడదీయరాని అనుబంధం ఉంది. ప్రధానంగా పరకాల, ఆత్మకూరు, గీసుకొండ ప్రాంతాల్లో వ్యక్తిగత అనుచర వర్గం కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్‌ను వీడే పరిస్థితి వస్తే పరకాల కేంద్రంగా, గీసుకొండలోని అనుచరులతో కొంతమేర కదలిక ఉండొచ్చన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అయితే స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ఎంతమంది వెళ్తారని లెక్కలు వేస్తున్నారు.
రాజీనామా నుంచి రీ ఎంట్రీ దాకా..
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య కేబినెట్ లో కొనసాగలేనం టూ కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆమె వెంట పలువురు నేతలు వెళ్తారని ప్రచారం జరిగింది. చివరకు మంత్రి పదవికి రాజీనామా చేసిన వారిలో సురేఖ ఒక్కరే నిలిచారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన పరిణామాలతో టీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సురేఖ మంత్రి పదవిని ఆశించినా దక్కలేదు. ఆమె భర్త మురళికి కేసీఆర్ ఎమ్మెల్సీ కట్టబెట్టారు.
కుమార్తె టికెట్‌తో విభేదాలు
2018 ఎన్నికల సమయంలో తన కుమార్తె సుస్మితకు పరకాల నుంచి టికెట్ ఇవ్వాలని కొండా దంపతులు డిమాండ్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అది నెరవేరకపోవడంతో టీఆర్‌ఎస్‌కు దూరమై తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సురేఖ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరితో విభేదాలు, మేడారం అభివృద్ధి పనుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో విభేదాలు కొన్నాళ్లుగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
పదవి పోతే రాజకీయ అడుగు ఎటు?
మంత్రి పదవి కోల్పోతే ఆ తర్వాత కొండా దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ అధిష్ఠానంతో రాజీ పడతారా? లేక రాజకీయంగా కొత్త దారిని ఎంచుకుంటారా? అనేదానిపైనే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది.
బీజేపీలోకి వెళ్లే చాన్స్ ఉందనే చర్చ ఉన్నప్పటికీ అది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకే పరిమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే కొండా దంపతుల వెంట ఎవరు వెళ్తారు? పరకాల, గీసుకొండలో వారి రాజకీయ ప్రభావం ఎంతవరకు పనిచేస్తుంది? ఒకవేళ మంత్రి పదవి పోయిన కాంగ్రెస్‌తో బంధం కొనసాగుతుందా? లేక కొండా దంపతులు మరో రాజకీయ అడుగు వేస్తారా? అనేది ప్రస్తుతం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్ గా మారింది.
కూతురి వ్యాఖ్యలతో తల్లికి తలనొప్పి
ఇటీవల కొండా సురేఖ (Konda Surekha) జన్మదినం రోజున ఆమె కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయగా.. అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేయడంతో క్షమాపణలతో సద్దుమణిగింది.
తాజాగా మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పార్టీ అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేయడం, తన కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వివరణ ఇవ్వడం మరింత కలకలం రేపాయి. దీంతో మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించడం ఖాయమనే ప్రచారం మొదలైంది.

