కలం, వెబ్ డెస్క్: సింగరేణిలో భారీ అవినీతి (Singareni Scam) జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పలువురు పార్టీ నేతలు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి బావమరిదే రింగ్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి అంటే కోల్ మాఫియా అని సింగరేణి కార్మికులు, ప్రజలు అనుకునే స్థాయికి ప్రస్తుత పరిస్థితి దిగజారిందని కేటీఆర్ అన్నారు. ఈ కుంభకోణంపై తాము అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్క సమాధానం కూడా రాలేదని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాధానం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడుతూ, విదేశాల్లో తిరుగుతూ పాఠాలు నేర్చుకుంటున్నానని ఫొజులు కొడుతున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సింగరేణికి చెందిన 10 కోట్ల రూపాయల నిధులను ధారాదత్తం చేసి కార్మికులకు అన్యాయం చేశారని ఆరోపించారు. పారదర్శకతను పూర్తిగా పక్కన పెట్టేసి, దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం సింగరేణిలోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడానికే ఈ రింగ్ మాస్టర్ ఆటలు సాగుతున్నాయన్నారు. దీనిపై గవర్నర్ తక్షణమే స్పందించాలని కేటీఆర్ (KTR) కోరారు.
Read Also: తెలంగాణ అసెంబ్లీలో జపాన్ ప్రతినిధులు
Follow Us On: Instagram


