కలం, వెబ్ డెస్క్ : జపాన్‌లోని అయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందం (Japanese delegation) తెలంగాణ రాష్ట్ర శాసనసభ (Telangana Assembly)ను మంగళవారం సందర్శించింది. అయిచి ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ హిరిహితో కోండో నాయకత్వంలో వచ్చిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల బృందానికి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సభాపతి ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో ఉభయ రాష్ట్రాల ప్రతినిధులు వివిధ రంగాలలో పరస్పర సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. 2014లో రాష్ట్రం ఏర్పడిందని, శాసనసభలో చర్చలు ఎంతో అర్థవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ నినాదంతో 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం, జపాన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక స్నేహ సంబంధాలను గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పటికీ పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని తెలిపారు.

Read Also: 6 పేజీల లేఖ.. గవర్నర్‌కు BRS ఫిర్యాదు
Follow Us On: Instagram


