కలం, వెబ్ డెస్క్: దేశంలో రిపబ్లిక్ డే (Republic Day) వేడుకల వేళ సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్మూ (Jammu) జిల్లాలోని సాంబా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన ఒక చొరబాటుదారుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది హతమార్చారు. రామ్‌గఢ్ సెక్టార్‌లోని చెక్ మజ్రా బోర్డర్ అవుట్ పోస్ట్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి ముసుగు వేసుకొని భారత్ వైపు చొరబడేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తంగా ఉన్న బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడి కదలికలను గుర్తించి హెచ్చరించారు. అయినా ఆ వ్యక్తి ఆగకుండా ముందుకు రావడంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.
బీఎస్ఎఫ్ కాల్పుల్లో సదరు వ్యక్తి చనిపోయాడు. సదరు వ్యక్తి మృతదేహం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోనే ఉందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం వెలుతురు వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు జమ్మూలోని (Jammu) సాంబా జిల్లాలో (Samba) డాబోహ్ గ్రామానికి చెందిన జియాఫత్ హుస్సేన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్‌లో మూడు పాకిస్థాన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Also: రిపబ్లిక్ డే అలర్ట్.. 10వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
Follow Us On: Youtube


