కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ ఆఫీస్‌లో భారీగా అక్రమాలను ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు ముగ్గురిపై చర్యలకు సిఫార్సు చేసింది. కాగా, దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) లో భారీగా అవకతవకలను కనుగొంది. 2021-22 ఖరీఫ్ సీజన్లో 39 రైస్ మిల్లులు రూ.64 లక్షల విలువైన 581 మెట్రిక్ టన్నుల మేర సీఎంఆర్ అక్రమాలకు పాల్పడితే అందులో కేవలం రెండు రైస్ మిల్లుల పైనే చర్యలు తీసుకున్నట్లు గుర్తించారు.
అలాగే 2022-23 ఖరీఫ్ సీజన్లో కూడా 37 మిల్లులు సీఎంఆర్‌లో డిఫాల్ట్ కాగా అప్పుడు కూడా రెండే రైస్ మిల్లులపై నామమాత్రపు చర్యలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ ఏడాది అక్రమాలు మరింతగా పెరిగి 19,529 మెట్రిక్ టన్నుల మేర అంటే ఏకంగా రూ.41 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం తిరిగి పంపించడంలో అక్రమాలు జరిగాయి. ఇక 2023 – 24 ఖరీఫ్‌లో ఏడు రైస్ మిల్లులు డిఫాల్ట్ కాగా, మూడింటిపైనే చర్యలు తీసుకున్నారు. అప్పుడు రూ.రెండున్నర కోట్ల విలువైన 5194 మెట్రిక్ టన్నుల వ్యవహారం బయటపడింది. ఆ ఏడాదిలో క్రిమినల్ కేసు పెట్టిన ఒక రైస్ మిల్లుకే మళ్ళీ 2024-25కు చెందిన సీఎంఆర్ కేటాయింపులు చేయడం కూడా ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడింది.
2025 సెప్టెంబర్ నుంచి కామారెడ్డి (Kamareddy) సివిల్ సప్లైస్ జిల్లా అధికారి కానీ, జిల్లా మేనేజర్ కానీ, ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేయలేదని తేలింది. అలాగే ఈ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనుమానాస్పద లావాదేవీలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ మేరకు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే అక్రమాలపై ఏసీబీ నివేదిక పంపింది. కామారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ అధికారి, జిల్లా మేనేజర్, డిప్యూటీ తహశీల్దార్ పై చర్యలకు సిఫారసు చేసింది.
Read Also: తెలంగాణలో పది మంది డీఎస్పీల బదిలీ
Follow Us On: Pinterest


