కలం, వెబ్ డెస్క్: ఇటీవల జర్నలిస్టుల అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. జర్నలిస్టుల అరెస్టులపై రాహుల్ గాంధీ సైతం స్పందించాలని డిమాండ్ చేశారాయన. ‘‘కాంగ్రెస్ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోంది. జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కదా?’’అని రియాక్ట్ అయ్యారు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓ మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించడం కొత్త చర్చకు దారితీస్తోంది. నిన్నటివరకు ‘ఫ్రెండ్లీ ప్రెస్’ నినాదం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ భవన్‌లో ఓ మీడియా (Media) ప్రతినిధులపై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమవుతోంది.
ఇటీవల జరిగిన ఏబీఎన్ టీవీ చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావును “గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్” అంటూ యాంకర్ వెంకటకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుకు వెంకటకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. ఏబీఎన్ టీవీ ఛానల్ చర్చల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్న రాదని నిర్ణయించింది. అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ABN ఛానల్ ప్రతినిధులకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. అయితే మీడియా (Media)పై ఆంక్షలు విధించడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా మీడియా వర్గాలను దూరంపెట్టే ప్రయత్నం చేసింది. 2023 ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియాకు మాత్రమే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. అలాగే కేసీఆర్, కేటీఆర్‌పై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం డిజిటల్ మీడియా, ఇన్‌ఫ్లుయెన్సర్లను లక్ష్యంగా చేసుకొని నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలున్నాయి.
కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంచలనంగా నిలిచే ఏపీలో సైతం మీడియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మీడియా ప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించాయి. అలాగే ప్రభుత్వ పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు అందకుండా చేశాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం (TDP Govt) కూడా వ్యతిరేక మీడియాను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయాలు పార్టీలు ఒకవైపు మీడియాకు స్వేఛ్చనిస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధించడం సర్వసాధారణంగా మారింది.


