కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి నెలలోనే పోలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని ఆయన తెలిపారు. మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమకు భారీ విజయాన్ని అందిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ పథకాలు ఈ ఎన్నికల్లో తమ పార్టీకి గేమ్ ఛేంజర్ గా మారబోతున్నాయని ఆయన అన్నారు. ఈ రెండు పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, క్షేత్రస్థాయిలో పార్టీకి ఇవి ఎంతో మేలు చేస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ద్వారా తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


