కలం, వెబ్ డెస్క్: బీహార్ (Bihar) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి వేదికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలన్నదానిపై స్పష్టమైన నిబంధనలను జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) ఆమోదించిన ఈ రూల్స్ ఉన్నతాధికారుల నుంచి తక్కువ స్థాయి సిబ్బంది వరకు అందరికీ వర్తిస్తాయి.
ఈ మార్గదర్శకాల ఉద్దేశ్యం సోషల్ మీడియా (Social Media) వాడకాన్ని నిషేధించడం కాదని, డిజిటల్ వేదికల్లో క్రమశిక్షణ, బాధ్యత, గౌరవం పాటించేలా చేయడమేనని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే ముందుగా సంబంధిత శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నకిలీ ఖాతాలకు అనుమతి లేదు. వ్యక్తిగత అభిప్రాయాలను పోస్ట్ చేసే సమయంలో ప్రభుత్వ హోదా, శాఖ పేరు, ప్రభుత్వ లోగో లేదా గుర్తులు వాడకూడదని స్పష్టం చేసింది. వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల కోసం అధికారిక ఈమెయిల్ ఐడీలు లేదా ప్రభుత్వ ఫోన్ నంబర్లను ఉపయోగించరాదు.
అలాగే అసభ్యకరమైన, ఉద్రిక్తతను రెచ్చగొట్టేలా, ఇతరులకు భంగం కల్గించే కంటెంట్‌ను నిషేధించింది. అధికారిక సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, కార్యాలయాల్లో తీసిన ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని తేల్చి చెప్పింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వపరమైన చర్యలు, ఉద్యోగానికి సంబంధించిన ఇతర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీహార్ (Bihar) ప్రభుత్వం హెచ్చరించింది.
Read Also: నిజాం నగలను హైదరాబాద్‌కు పంపే ఆలోచన లేదు: కేంద్రం
Follow Us On: X(Twitter)


