కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నందున జరిగే విచారణను వాయిదా వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి (Alleti Maheshwar Reddy) విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జనవరి 30న చేపట్టనున్నట్లు స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్‌తో పాటు పిటిషనర్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సైతం హాజరు కావాల్సి ఉన్నది. కానీ ఈ విచారణకు తాను హాజరు కాలేనంటూ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ల ప్రక్రియ జనవరి 30న ముగుస్తుందని, పార్టీ రాష్ట్ర నాయకుడిగా జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఖరారుతో పాటు నామినేషన్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉన్నందున మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక పూర్తయ్యేంత వరకు విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో స్పీకర్‌కు వివరించారు. ఫిబ్రవరి 20 తర్వాత ఏ రోజు విచారణ పెట్టినా హాజరు కాగలనని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణ ఫిబ్రవరి 17న విచారించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు.


