కలం, వెబ్‌డెస్క్: గాంధీజీ (Mahatma Gandhi) చెప్పిన స్వదేశీ సూత్రం దేశాభివృద్ధికి మూల స్తంభమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహాత్మా గాంధీజీ వర్థంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న బాపూజీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. అంతకుముందు ‘ఎక్స్’ వేదికగా మహాత్మునికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. అలాగే ఇదే రోజు అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నందున దేశాభివృద్ధిలో వాళ్ల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
‘జాతిపిత మహాత్మా గాంధీజీ పుణ్య తిథి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. ఆయన వ్యక్తిత్వం, ఆదర్శాలు ఈ దేశ ప్రజలను ఎప్పటికీ నడిపిస్తూనే ఉంటాయి. దేశ సర్వతోముఖావృద్ధికి స్వదేశీ సూత్రం ద్వారా గాంధీజీ బలమైన పునాది వేశారు. ఇది దేశ స్వావలంబన, అభివృద్ధికి మూలస్తంభం వంటిది’ అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే స్వాతంత్య్రం కోసం, దేశాభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ, వారి సేవలను ట్వీట్లో ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.
కాగా, రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి (Mahatma Gandhi) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, స్పీకర్ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు.


