కలం, డెస్క్ : తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ నటించిన జననాయగన్ (Jana Nayagan) చుట్టూ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ టీమ్ కు సెన్సార్ బోర్డు టీమ్ కు మధ్య వివాదం కోర్టుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో సెన్సార్ బోర్డు పిటిషన్ వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చూస్తోంది.
దీంతో వారికంటే ముందే సెన్సార్ బోర్డు తాజాగా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఈ మూవీ రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోలేమని గతంలోనే చెప్పింది. మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ మూవీ టీమ్ ఒకవేళ మళ్లీ పిటిషన్ వేస్తే.. దాని మీద ఎలాంటి ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇవ్వాలన్నా కేవియట్ పిటిషన్ ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు వాదనలు కూడా వినాల్సిందే.
అసలేం జరిగిందంటే..?
విజయ్ మూవీ జననాయగన్ సినిమా (Jana Nayagan) జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో రిలీజ్ ఆగిపోయింది. మూవీ టీమ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేస్తే.. సింగిల్ బెంచ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును ఈ నెల 27న డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ప్రస్తుతం మూవీ రిలీజ్ పై సస్పెన్స్ నెలకొంది.


