కలం, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసీఆర్ వర్సెస్ ‘సిట్’ (KCR vs SIT) మధ్య ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎత్తుకు పై ఎత్తులతో వ్యూహ ప్రతివ్యూహాలు తెరపైకి వచ్చాయి. ఇటు సిట్ నుంచి నోటీసులు.. అటు కేసీఆర్ నుంచి లెటర్‌ల పర్వం కొనసాగుతున్నది. సీఆర్పీసీ (CrPC)లోని సెక్షన్ 160 ప్రకారం తనను నివాసంలోనే విచారించాలని కేసీఆర్ ఆ లేఖలో సిట్‌కు వివరించారు. ప్రస్తుతం తాను ఉంటున్నది సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో అని, అందువల్ల అక్కడే విచారించాలని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ అసెంబ్లీ రికార్డుల ప్రకారం కేసీఆర్ అడ్రస్ నందినగర్ కావడంతో అక్కడే విచారిస్తామని సిట్ వాదిస్తున్నది. ఆ ప్రకారమే నందినగర్ నివాసానికి వెళ్ళిన సిట్ పోలీసులు ఫస్ట్ నోటీసును అక్కడ అందజేశారు. ఇప్పుడు కూడా రెండో నోటీసును ఆ అడ్రస్‌లోనే ఇవ్వనున్నారు. నోటీసు ఇచ్చిన విషయాన్ని (శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు) సిట్ ధృవీకరించలేదు. విచారణను సైతం అక్కడే నిర్వహించనున్నారు.
ఎంక్వయిరీకి సిద్ధంగా ఉండండి : సిట్
కేసీఆర్ నివాసం హైదరాబాద్‌లోని నందినగర్ (Nandi Nagar) అయినందున అక్కడే ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అఫీషియల్‌గా నోటీసు ఇచ్చిందీ లేనిదీ ఇటు పోలీసుగానీ, అందుకున్న అంశంపై అటు కేసీఆర్ వర్గీయులుగానీ వెల్లడించలేదు. ఈ టెక్నికల్ కారణం దృష్ట్యానే ‘హైదరాబాద్ నగర పరిధిలో’ అనువైన స్థలాన్ని సూచించాల్సిందిగా కేసీఆర్‌కే ఆప్షన్ ఇచ్చింది సిట్. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను కేసీఆర్ సూచించడంతో ఇప్పుడు సిట్ టెక్నికల్ కోణం నుంచి ప్రొసీడ్ కావాలనుకుంటున్నది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చినా ఏ ఇబ్బందీ లేదని సిట్ ఫస్ట్ నోటీసులోనే స్పష్టం చేసింది. సీఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం కేసీఆర్ ఎంక్వయిరీ స్థలాన్ని ఎంపిక చేసుకుంటే.. సిట్ పోలీసులు మాత్రం అసెంబ్లీ రికార్డులతో పాటు ఇతర అధికారిక కరస్పాండెన్స్ కు అనుగుణంగా నందినగర్ నివాసాన్ని అడ్రస్‌గా భావిస్తున్నారు.
వాయిదాకు ఓకే… ప్లేస్‌పైనే పేచీ :
సిట్ పోలీసులు తొలుత ఇచ్చిన నోటీస్ ప్రకారం జనవరి 30న విచారణ పూర్తి కావాల్సి ఉన్నది. కానీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి తేదీని దృష్టిలో పెట్టుకుని ‘ప్రీ-ఆక్యుపైడ్ ప్రోగ్రామ్’ పేరుతో కేసీఆర్ వాయిదా కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన సిట్ జనవరి 30 విచారణ తేదీని వాయిదా వేసింది. ఆ తర్వాత ఏ రోజు డేట్ ఫిక్స్ చేసినా తాను అందుబాటులో ఉంటానని, పూర్తిగా సహకరిస్తానని ‘సిట్’కు రాసిన లేఖలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అదే లేఖలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను (Erravalli Farmhouse) ఎంక్వయిరీ వేదికగా కేసీఆర్ పేర్కొన్నారు. తేదీని మార్చడానికి పాజిటివ్‌గా స్పందించిన సిట్ పోలీసులు ఎంక్వయిరీ వేదిక విషయంలో మాత్రం ‘హైదరాబాద్ పరిధిలోనే’ అనే అంశం దగ్గర వెనక్కి తగ్గాలనుకోవడంలేదు. వాస్తవానికి నందినగర్‌లో విచారించాలన్న ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ పోలీసులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.
విచారణపై సస్పెన్స్ కంటిన్యూ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు తదితరులందరినీ విచారించిన సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వారి నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా ‘పెద్దాయన’ను (KCR) కూడా విచారించాలని డిసైడ్ అయింది. ఇంటెలిజెన్స్ మాజీ స్టాఫ్ నుంచి వచ్చిన వివరాల మేరకు ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ పాత్రపై పోలీసులు ప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు. తదుపరి దర్యాప్తుపై కార్యాచరణ రూపొందించుకోడానికి ముందు కేసీఆర్‌ను విచారించడం, ఆయన అభిప్రాయాలు తీసుకోవడం, ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడం కీలకం కానున్నాయి. ఇప్పటివరకూ విచారణలో పలువురు వెల్లడించిన అంశాలు, పోలీసులు సేకరించిన ఎవిడెన్సులను కేసీఆర్ ముందు ఉంచి ఆయన నుంచి సమాధానాన్ని రాబట్టడం ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్లాన్‌లో ఒక కీలకమైన ఘట్టం. సిట్ నోటీసులివ్వడం, కేసీఆర్ లేఖలు రాయడం.. రెండు రోజులుగా జరుగుతున్న ఈ హై డ్రామాలో (KCR vs SIT) చివరకు ఎంక్వయిరీ ఎప్పుడు జరుగుతుంది.. ఎక్కడ జరుగుతుంది.. అనేవి ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.
Read Also: ఎన్నికల రాష్ట్రాలపై నిర్మలమ్మ ప్రేమ !
Follow Us On : WhatsApp


