కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణిలో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టీ ఉత్పత్తి పెంచుతామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. కోల్ బెల్ట్ పర్యటనలో భాగంగా ఆయన శనివారం కొత్తగూడెం లోని ఇల్లందు అతిథి గృహంలో సింగరేణి అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ల సమయంలో సైట్ విజిట్ అనేది తప్పనిసరి అన్నారు. ఈ విధానం కోల్ ఇండియా లో కూడా ఉందని స్పష్టం చేశారు. దీని వలన కాంట్రాక్టర్లకు స్థానిక పరిస్థితులు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఉత్పత్తి వేగంగా జరుగుతుందని Kishan Reddy తెలిపారు.
సింగరేణి లో ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలి అనే అంశం మీద ఇప్పటికే కమిటీ వేశామన్నారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అధికారులతో కలిసి చర్చించామన్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు రావాలంటే నూతన గనులు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిని బలోపేతం చేయడానికి సంస్థ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరయ్యేలా వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తద్వారా ఉత్పత్తి పెంచి,ఆర్ధిక భారం తగ్గించి సంస్థ ను లాభాల బాటలో నడపొచ్చు అని చెప్పారు. సింగరేణి కి జెన్కో నుంచి రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా వసూలు చేసేందుకు మార్గాలు అన్వేషించాలని అధికారులను కిషన్ రెడ్డి ఆదేశించారు. కాగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం కూడా అధికారులతో,సంఘాలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.


