epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

కేంద్ర బడ్జెట్ : ఆసక్తికర విశేషాలు

కలం, తెలంగాణ బ్యూరో: బడ్జెట్.. అంకెల చుట్టూ తిరిగే మన భవిష్యత్తు బతుకు చిత్రం! వర్తమానం వేదికగా గతాన్ని మననం చేసుకుంటూ కూడికలు, తీసివేతలతో రాసుకునే ముందస్తు చిట్టా పత్రం!! స్వతంత్ర భారతావనితో శరణార్తుల రక్షణ కోసం, రక్షణ రంగ బలోపేతం కోసం ఉదయించిన తొలి ‘పద్దు’.. ఇప్పుడు ‘అభివృద్ధి చెందిన భారత్’ దిశగా వెలుగులీనుతున్నది. 1947 నవంబర్ లో దాదాపు రూ. 197 కోట్లతో స్టార్టయిన కేంద్ర బడ్జెట్ (Union Budget).. ప్రస్తుతం 50 లక్షల కోట్లు దాటిపోయింది. అసలు.. బడ్జెట్ కథ ఏమిటి?! ఎలా మొదలైంది?! జరిగిన మార్పులు ఏమిటి?! కేంద్ర బడ్జెట్ చరిత్రపై స్పెషల్ స్టోరీ..

స్వతంత్రానికి పూర్వం

1860 ఏప్రిల్ 7.. భరత ఖండంపై నిలబడి బ్రిటిష్ వాళ్లు తమ కోసం తాము పెట్టుకున్న తొలి బడ్జెట్ రోజు అది!! నాడు స్వాతంత్ర్య పోరాటం (సిపాయిల తిరుగుబాటు) వల్ల భారీగా నష్టపోయామంటూ బ్రిటిష్ సర్కార్ ఇందులో ఇన్ కమ్ ట్యాక్స్ ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ మొత్తం దాదాపు రూ. 40 కోట్లు. అందులో ఎక్కువ శాతం బ్రిటిష్ సైన్యానికి, లండన్ కు పంపే హోమ్ చార్జీలకే సరిపోయేది. దాన్ని జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. అదంతా స్వాతంత్ర్యానికి పూర్వం కథ!! కానీ, స్వతంత్ర భారత్ లో తొలి‘పద్దు’ పొడిచింది మాత్రం 1947 నవంబర్ 26న. ఆ రోజు తొలి భారతీయ బడ్జెట్ ను ఆర్.కె.షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. మొత్తం వ్యయం రూ. 197 కోట్ల 39 లక్షలు! నాడు దేశవిభజనతో ఏర్పడిన అశాంతిని చల్లార్చేందుకు గాను రక్షణ శాఖకే 47 శాతం (రూ.92 కోట్లు) నిధులు కేటాయించారు.

మన టైమ్ ప్రకారమే..

– కాలక్రమంలో మార్పులు వచ్చాయి… పాలకుల ప్రయారిటీస్ మారిపోయాయి.. బడ్జెట్ కూడా రూపాంతరం చెందుతూ వచ్చింది. 1999 వరకు బడ్జెట్ ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. దేశస్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వాళ్లు ఈ టైమ్ ను సెలెక్ట్ చేశారు. లండన్ పార్లమెంట్ ఉదయం ఓపెన్ అయ్యే సమయానికి భారత బడ్జెట్ తమకు అందుబాటులో ఉండాలి అనీ అలా ఫిక్స్ చేశారు. 1999లో దీన్ని ఉదయం 11 గంటలకు యశ్వంత్ సిన్హా మార్చేశారు. మన టైమ్ ప్రకారమే మన బడ్జెట్ ఉంటుందని ప్రకటించారు.
– బ్రిటిష్ వాళ్లు తమ సౌకర్యం కోసం ఫిబ్రవరి చివరల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టేవారు. అదే సంప్రదాయం 2016 వరకు కొనసాగింది. దానికి ఫుల్ స్టాప్ పెడ్తూ మోదీ సర్కార్ 2017 నుంచి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టేలా రూల్ తెచ్చింది.
– 1924లో మొదలైన రైల్వే బడ్జెట్ దాదాపు 92 ఏండ్ల పాటు కొనసాగింది. 2016 ఫిబ్రవరి 25తో దాని చరిత్ర ముగిసింది. ఆ చివరి రైల్వే బడ్జెట్ ను నాటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెట్టారు. అనంతరం 2017లో మెయిన్ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ విలీనమైంది.

25 వేల రెట్లు పెరిగిన బడ్జెట్

1947లో భారత తొలి బడ్జెట్ తో పోలిస్తే ఇప్పుడు బడ్జెట్ మొత్తం దాదాపు 25 వేల రెట్లు పెరిగింది. నాడు మన దేశ జనాభా 35 కోట్ల లోపే. కానీ, ఇప్పుడు అది దాదాపు 145 కోట్లకు చేరింది. జనాభా పరంగా 5 రెట్లు పెరగగా.. బడ్జెట్ మాత్రం అనూహ్యరీతిలో ఇంతింతై వటుడింతై అన్న రీతిలో పెరిగిపోయింది. 1947 నవంబర్ 26న మన దేశ బడ్జెట్ కేవలం రూ.197 కోట్ల 39 లక్షలు అయితే.. 2025లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 50 లక్షల 65 వేల 345 కోట్లు!! కేంద్ర బడ్జెట్ పది లక్షల కోట్ల మార్క్ ను 2010లో దాటింది. ఇక, గడిచిన ఐదేండ్లలోనే మన కేంద్ర బడ్జెట్ ఒకటిన్నర రెట్లకుపైగా పెరిగింది. 2020–21 బడ్జెట్ రూ.30 లక్షల కోట్లకు పైగా ఉంటా.. 2025–26 బడ్జెట్ రూ. 50 లక్షల కోట్లు దాటిపోయింది. ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Union Budget) మరింత ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. రక్షణ రంగంతో పాటు మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తున్నది. ఏఐ, డిజిటల్ ఇండియా కోసం కూడా భారీ కేటాయింపులు చేపట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: చట్టం తన పని తాను చేసుకుపోతుంది: శ్రీధర్ బాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>