కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎంఎస్. జి. సౌమ్య (Excise constable Soumya) శనివారం రాత్రి కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మృత్యువుతో పోరాడిన ఆమె, చివరకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
నిజామాబాద్ జిల్లా మాధవనగర్ శివారులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ బృందం వాహనాల తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో నిందితులు ప్రయాణిస్తున్న కారును ఆపేందుకు సౌమ్య ప్రయత్నించగా, వారు ఆమెపైకి కారును వేగంగా పోనిచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమె కడుపు భాగం, లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
నిమ్స్‌లో సౌమ్యకు మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా అత్యవసర చికిత్స అందించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శస్త్రచికిత్సలు చేసి, కిడ్నీ, స్ప్లీన్ తొలగించినప్పటికీ పరిస్థితి విషమించింది. మెదడులో వాపు పెరగడం, అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆమె మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.


