కలం, తెలంగాణ బ్యూరో : కేంద్రం బడ్జెట్ (Union Budget) పెడుతుందనగానే కొత్త స్కీమ్‌లు, సంక్షేమం (Welfare), వరాలు ఉంటాయేమోనని జనం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. మౌలిక సదుపాయాల కల్పన (Infra), ఉత్పత్తి (Manufacturing), దాని ద్వారా ఉపాధి కల్పన (Employment), సర్వీస్ సెక్టార్ (Service Sector) ఆదాయం.. వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను గమనంలోకి తీసుకుని ఎకానమీని కాపాడుకోవడం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళకుండా చూసుకోవడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలను బ్యాలెన్స్ చేయడం.. వీటికి అనుగుణంగా బడ్జెట్ తయారైంది. డిజిటల్ టెక్నాలజీ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని రాబోయే తరానికి తగినట్లు కొన్ని కొత్త స్కీమ్‌లకు శ్రీకారం చుట్టింది.
నెక్స్ట్ జెనరేషన్‌కు డిజిటల్ టెక్నాలజీ :
భవిష్యత్తు అంతా డిజిటల్ అని పదేపదే నొక్కిచెప్తున్న కేంద్ర సర్కార్ తాజా బడ్జెట్‌లో ఆ రంగానికి ప్రాధాన్యతతో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చింది. భారత్‌లో నెలకొల్పబోయే క్లౌడ్ సెంటర్లు, డేటా సెంటర్లకు అనేక రకాల ఇన్సెటివ్స్ ప్రకటించింది. మరోవైపు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్.. ఇలాంటి రంగాలకు ఉన్న ఆదరణ రీత్యా విద్యార్థి దశ నుంచే వీటిల్లో ప్రావీణ్యం లభించేలా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ను సెకండరీ స్కూళ్ళు, కాలేజీలలో పెట్టేలా బడ్జెట్‌లో కేంద్రం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దేశ ఎగుమతుల్లో దాదాపు 50% ఐటీ, సర్వీస్ సెక్టార్‌కు సంబంధించిన అంశాలే కావడంతో ఈ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు క్లౌడ్ సెంటర్లకు 2047 వరకు పూర్తిస్థాయి పన్ను మినహాయింపు ఇచ్చింది. ఉపాధి కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పైనా దృష్టి పెట్టింది.
స్వయం సమృద్ధిగా ఉండాలనే లక్ష్యం :
టెక్నాలజీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, ఏవియేషన్, ఉత్పత్తి రంగాల్లో స్వయం సమృద్ధిగా ఉండాలనే లక్ష్యంతో ఈ రంగాలకు తాజా బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ వెలుగులో దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని భావించిన కేంద్ర సర్కార్ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి లక్ష కోట్లకు పైగా ఎక్కువ నిధులను కేటాయించింది. అన్ని రంగాలకంటే ఎక్కువగా రక్షణకు (జాతీయ రహదారుల తర్వాత) ప్రయారిటీ కల్పించింది. టెక్నాలజీ వినియోగాన్ని సైతం విస్తృతంగా వినియోగించుకోవాలని భావించింది. ఏవియేషన్ సహా రక్షణ రంగ పరిశ్రమలు, పరిశోధనకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. వివిధ దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల్లో వచ్చిన మార్పులు, అదనపు టారిఫ్‌ల విధింపు, వివిధ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం.. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని దీర్ఘకాల ప్రణాళికను బడ్జెట్‌లో (Union Budget) వివరించింది.
Read Also: యూనియన్ బడ్జెట్ 2026.. సామాన్యులకు దక్కిందేంటి?
Follow Us On : WhatsApp


