బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం

కలం, తెలంగాణ బ్యూరో : LPG Price Hike | అమెరికా-ఇరాన్ యుద్ధం పేరుతో దేశంలోని కమర్షియల్ ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు భారీ స్థాయిలో పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 993 చొప్పున పెంచడంతో హైదరాబాద్‌లో వాటి ధర రూ. 3400కు చేరింది. మూడు నెలల వ్యవధిలో రేటు రెట్టింపు కావడంతో హోటళ్లు, హాస్టల్లు, ఫుట్‌పాత్ స్టాల్స్ విక్రయించే టీ, టిఫిన్, భోజనం ధరలు అమాంతం పెరిగిపోయాయి. మార్చి నెలలో పెంచిన ధరలతోనే ఫుడ్ ఐటెమ్స్ ధరలు పది రూపాయల నుంచి నలభై వరకు పెరిగాయి. ఇప్పుడు భారీ స్థాయిలో ఎల్పీజీ రేటు పెంచడంతో ఆహార పదార్ధాల ధరలు మరింతగా పెరగనున్నాయి. పెంచితే బిజినెస్ పడిపోతుంది.. పెంచకుంటే గిట్టుబాటు కాదు.. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. అంటూ చిరు వ్యాపారులు మొత్తుకుంటున్నారు. హాస్టళ్ల యజమానులు సైతం నెలవారీ రెంట్‌ను పెంచడంతో బ్యాచ్‌లర్స్‌కు తిప్పలు మొదలయ్యాయి.

ప్రభుత్వానికీ పడిపోనున్న ఆదాయం :

హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుట్‌పాత్ స్టాళ్ళ వ్యాపారంలో ప్రతీ వస్తువు కొనుగోలుపై జీఎస్టీ పేరుతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతూ ఉన్నది. ఇప్పుడు ఎల్పీజీ ధరల పెంపుతో బిజినెస్ పడిపోతున్నదనేది చిరు వ్యాపారుల వాదన. దీంతో పరోక్షంగా ప్రభుత్వానికి జీఎస్టీ, వాణిజ్య పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికీ గండిపడుతున్నది. ప్రభుత్వ లెక్కల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3400కు చేరినా గ్యాస్ ఏజెన్సీలు మాత్రం మరో రూ. 1500 లేదా రూ. 2000 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నాయి. పలు హోటళ్ల యజమానులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా సిలిండర్ ధరలు రెట్టింపు కావడంతో ధరలు పెంచక తప్పట్లేదు. కానీ ఈ నిర్ణయంతో వ్యాపారం పడిపోతున్నది. హాస్టళ్ళ యజమానులు సైతం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌కు కలిపి ప్రస్తుతం రూ. 150 మాత్రమే వసూలు చేస్తున్నామని, ఇప్పుడు ఎల్పీజీ రేటు పెరగడంతో సప్లై చేయలేమని బ్యాచ్‌లర్స్ మీద ఒత్తిడి తెస్తున్నారు. అంతిమంగా ప్రజలపై భారం పడుతున్నది.

ప్రధాని విజిట్‌కు ముందు బీజేపీకి తలనొప్పి :

ప్రధాని మోడీ ఈ నెల 10న తెలంగాణ సందర్శనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం (LPG Price Hike), డొమెస్టిక్ సిలిండర్లు టైమ్‌కు రీపిల్లింగ్ డెలివరీ చేయకపోవడం, పెట్రోలు బంకుల్లో పెట్రోలు, డీజిల్‌కు ఇబ్బందుల తలెత్తడం.. ఇవన్నీ స్థానిక బీజేపీ లీడర్లకు తలనొప్పిగా మారింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నందున హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు రూపంలో ప్రజల నుంచి వ్యతిరేకత ముంచుకొస్తున్నదనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో మొదలైంది. ప్రధానిపై ఒత్తిడి తేవడానికి, హైదరాబాద్ విజిట్ సందర్భంగా నిరసన తెలపడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌కు పొలిటికల్‌ అస్త్రం రెడీ :

ధర పెంచింది కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌కే అయినా అది వేర్వేరు రూపాల్లో తిరిగి సామాన్యులకే భారంగా మారుతున్నది. డొమెస్టిక్ సిలిండర్ల ధరలను పెంచలేదని బీజేపీ సర్దిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ప్రజలు కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదని పార్టీ లోకల్ లీడర్లు భావిస్తున్నారు. సరిగ్గా ఈ అంశాన్నే కాంగ్రెస్ పొలిటికల్ అస్త్రంగా మల్చుకోవాలనుకుంటున్నది. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. పెంచిన ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయం అని మండిపడ్డారు. ఒక్కసారిగా 35% పెంచడంతో హోటళ్లు, కేఫ్‌లు రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలు ముగిసి 24 గంటలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>