కలం, తెలంగాణ బ్యూరో : Telangana Ministers | రాష్ట్రంలో భూముల విలువను సవరించాలన్న ప్రభుత్వ ఆలోచన తాత్కాలికంగా పెండింగ్‌లో పడింది. నలుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయం నెలకొన్నది. సబ్ కమిటీ కేవలం సిఫారసు మాత్రమే చేయాలి తప్ప నిర్ణయం తీసుకునే అధికారమెక్కడిదనే వివాదం చోటుచేసుకుంది. దీనికి తోడు నిర్దిష్టంగా డెడ్‌లైన్ పెట్టి మరీ ఆదేశాలు ఇవ్వడాన్ని ఓ మంత్రి తప్పుపట్టారు. సంబంధిత డిపార్టుమెంటు సెక్రటరీకి తెలియకుండానే సబ్ కమిటీ ఒక కంక్లూజన్‌కు ఎలా వస్తుందన్నది హాట టాపిక్‌గా మారింది. అమలు చేయకపోతే ఉపేక్షించబోమని సబ్ కమిటీ చైర్మన్ సంబంధిత శాఖ ఉన్నతాధికారిని హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆ శాఖ సెక్రటరీ ఎలక్షన్ డ్యూటీలో భాగంగా పశ్చిమబెంగాల్‌లో ఉండడంతో తిరిగి వచ్చిన తర్వాత ఏ టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారింది.
ఆదాయ వనరులను పెంచుకోవడమే లక్ష్యంగా.. :
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచుకోడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన నలుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఏయే శాఖల తరఫున ఆదాయం ఎంత వస్తున్నది.. గ్యాప్ ఎక్కడ ఉన్నది.. ఎగవేతలు ఏ మేరకు ఉన్నాయి.. వాటిని గాడిన పెట్టడానికి యాక్షన్ ప్లాన్.. లొసుగుల నివారణకు మార్గాలు.. ఇలాంటి అన్ని అంశాలపై సబ్ కమిటీ తరచూ సమావేశమై చర్చిస్తున్నది. గనులు, ఇసుక మైనింగ్, భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, ఎక్సయిజ్ తదితర డిపార్టుమెంట్ల అధికారులతో సబ్ కమిటీ చర్చించింది. అందులో భాగంగానే ఏప్రిల్ 24న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అందులో రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు కూడా పాల్గొన్నారు.
ఆ సమావేశంలో జరిగిన నిర్ణయమేంటి? :
“రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని భూముల వివరాలు సేకరించాలి.. ఖాళీగా ఉన్న భూములేవో.. ఆక్రమణకు గురైనవేవో తేల్చాలి.. ఆయా శాఖలు అందుబాటులో ఉన్న వివరాలను సేకరించాలి… జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సమాచారం క్రోడీకరించాలి..” అని మంత్రి జూపల్లి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మే నెల మొదటి వారం నుంచే సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేయాలి… రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచాలి… అశ్రద్ధ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం..” అని డిప్యూటీ సీఎం ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి తెలియకుండానే నిర్ణయాలు ఎలా? :
స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటుందని, ఆ శాఖ మంత్రికే తెలియకుండా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ఎలా అమలవుతుందన్నది ఆ శాఖలోని కొందరు అధికారుల వాదన. సబ్ కమిటీ సిఫారసు చేసిన తర్వాత సంబంధిత మంత్రితో చర్చించడమో లేదా అభిప్రాయాన్ని తీసుకోవడమే పూర్తయిన తర్వాతనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటుందన్నది ఆ ఆఫీసర్ల భావన. మంత్రికి తెలియకుండా లేదా మంత్రిని బైపాస్ చేసి నిర్ణయం ఎలా జరుగుతుందనే ప్రశ్నను లేవనెత్తారు. జవాబుదారీగా ఉండాల్సింది సంబంధిత శాఖ మంత్రి అయినప్పుడు నిర్ణయం గురించి చర్చించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో భేటీ తర్వాతనే స్పష్టత వస్తుందనే వాదనతో భూముల విలువను పెంచి మే ఫస్ట్ వీక్ నుంచి అమలు చేయాలనే నిర్ణయం పెండింగ్‌లో పడింది.

