జాగృతి టు రక్షణ సేన… కవిత ట్విస్టుల మీద ట్విస్టులు

కలం, తెలంగాణ బ్యూరో : కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పెట్టిన కొత్త పార్టీ పేరుపై మొదటి నుంచీ సందేహాలే. తొలుత తెలంగాణ ప్రజా జాగృతి పేరు ఉండబోతున్నట్లు లీకులు వచ్చాయి. వాటికి బలం చేకూర్చే విధంగా ఎన్నికల సంఘంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తెలంగాణ ప్రజా జాగృతి అని పేర్కొన్నారు. పార్టీ పేరు, జెండా, ఎజెండాను ఏప్రిల్ 25న ప్రకటించనున్నట్లు డేట్ ఫిక్స్ చేశారు. అప్పటివరకూ తెలంగాణ ప్రజా జాగృతి పేరే ఉంటుందనే కవిత అనుచరులు పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ టీఆర్ఎస్ అబ్రివేషన్‌ను అనౌన్స్ చేశారు. చివరకు అది తెలంగాణ రక్షణ సేనగా మారిపోయింది. పార్టీ పేరును ప్రకటించడానికి ముందు ట్విస్టులు ఉన్నట్లుగానే ప్రకటించిన తర్వాతా మార్పులు చేర్పులు జరిగాయి. ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ అబ్రివేషన్ వచ్చేలా పార్టీ పేరు కోసం రెండు రోజుల ముందే కసరత్తు జరిగినట్లు ఎన్నికల సంఘం ద్వారా నిర్ధారణ అయింది.

రాష్ట్ర సేన పేరుతో అప్లికేషనే ఇవ్వని కవిత :

కొత్త రాజకీయ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (Telangana Rashtra Sena) అంటూ ఏప్రిల్ 25న గర్వంగా ప్రకటించుకున్న కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన అప్లికేషన్‌లో ఆ పేరే పెట్టలేదు. తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి అనే ఐదు పేర్లను ఈ వరుసక్రమంలోనే తన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలి హోదాలో ఆ అప్లికేషన్‌తో పాటు జతచేసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా జాగృతి ఒక పొలిటికల్ పార్టీగానో, స్వచ్ఛంద సంస్థగానో, సాంస్కృతిక సంస్థగానో లేకుండానే ఆ లెటర్‌హెడ్‌పైన ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరునే ఆమె ప్రస్తావించలేదు. కానీ అఫీషియల్‌గా పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించడానికి రెండు రోజుల ముందే ఆమె ‘తెలంగాణ రక్షణ సేన’గా పేరు మార్చాలంటూ ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కమిషన్ అండర్ సెక్రటరీ మనీష్ కుమార్ రాతపూర్వకంగానే తెలియజేశారు. అప్పటివరకూ ఆమె తెలంగాణ ప్రజా జాగృతి పేరుతోనే దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.

‘రాష్ట్ర సేన’ నుంచి ‘రక్షణ సేన’గా పేరు మార్పు :

తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పార్టీ జెండాను ప్రకటించారు. ఆ రోజునే పార్టీ పేరు కిందన ‘అసోసియేషన్’ అనే పదాన్ని రాయడం చర్చకు దారితీసింది. ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం పార్టీ లేదా అసోసియేషన్ లేదా డెమొక్రటిక్.. ఇలా ఒక సఫిక్స్ పదాన్ని చేర్చాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, కల్చరల్ ఆర్గనైజేషన్స్, సొసైటీలు.. వీటికి భిన్నంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఇలాంటి సఫిక్స్ పదాన్ని ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. ఆ ప్రకారం ‘తెలంగాణ రాష్ట్ర సేన’ కింద అసోసియేషన్ అనే పదాన్ని చేర్చారన్న అభిప్రాయం ఏర్పడింది. తెలంగాణ రక్షణ సేన (Telangana Rakshana Sena) అంటూ పార్టీ పేరును మార్చడం వెనక కారణమేంటనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు కోసం ఏప్రిల్ 23ననే అప్లికేషన్ పెట్టిన కవిత.. 25వ తేదీన లాంఛింగ్ సమయానికి కూడా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అనే ప్రకటించారు. ‘రాష్ట్ర సేన’తో వచ్చిన ఇబ్బందేంటో.. ‘రక్షణ సేన’ అని ఎందుకు మార్చాల్సి వచ్చిందనే అంశంపై తెలంగాణ జాగృతి శ్రేణులు సైతం వివరణ ఇవ్వలేదు.

అభ్యంతరాలపైనే సర్వత్రా ఉత్కంఠ :

కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రతిపాదించిన ఐదు పేర్లలో ‘తెలంగాణ రక్షణ సేన’ను కేటాయించడానికి అభ్యంతరం లేదనే తీరులో కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ మంజూరు చేసింది. దానికి తగిన ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని సూచించింది. నాలుగు పత్రికల్లో ఆ పార్టీ పేరుతో నిర్దిష్ట ఫార్మాట్‌లో ప్రకటన ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి, పార్టీల నుంచి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా ఆ పేరుతో పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఎవరు ఎలాంటి అభ్యంతరాలు ఇస్తారో, వాటిని కమిషన్ పరిశీలన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆమె పెట్టే పార్టీ పేరు అబ్రివేషన్‌లో ‘టీఆర్ఎస్’ అని ఉండేలా ఎంచుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తమైంది. కమిషన్‌కు ఫిర్యాదు కూడా వెళ్ళింది. ఇప్పుడు పార్టీ పేరు ఫుల్ ఫామ్ ఏదైనా అబ్రివేషన్‌లో మళ్లీ టీఆర్ఎస్ అని రావడంతో కచ్చితంగా అబ్జెక్షన్స్ వస్తాయనే సాధారణ అభిప్రాయంనెలకొన్నది. పార్టీ పేరును కమిషన్ ఖరారు చేసేంత వరకు సస్పెన్స్ కంటిన్యూ.

Read Also: షాకింగ్ .. మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>