కలం, వెబ్ డెస్క్: మస్కట్‌లో (Muscat) పనిచేసేందుకు వెళ్లిన ఏపీకి చెందిన ఓ మహిళ.. అక్కడ యజమానులు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేకపోయింది. తనను కాపాడమని ఓ వీడియో పెట్టగా, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మస్కట్‌లో వేధింపులు తాళలేక ‘పవన్ కళ్యాణ్ అన్నా.. కాపాడన్నా’ అంటూ రోదిస్తూ వీడియో పంపించారు. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలు విని పవన్ కళ్యాణ్ చలించిపోయారు.
అధికారులకు కీలక ఆదేశాలు..
షెహనాజ్‌ను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో ఆమె భర్త ద్వారా ఒమన్‌లోని ఏజెంట్‌తో మాట్లాడారు. అనంతరం అక్కడ దౌత్య కార్యాలయం, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించారు. షెహనాజ్‌ను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also: ఏక సభ్య కమిషన్.. ఏకపక్షంగా మారింది: భూమన కరుణాకర్ రెడ్డి
Follow Us On: WhatsApp

