epaper
Friday, January 30, 2026
spot_img
epaper

ఎన్నికల రాష్ట్రాలపై నిర్మలమ్మ ప్రేమ !

కలం, తెలంగాణ బ్యూరో : ఎన్నికల జరగబోయే రాష్ట్రాలపై ప్రేమ కురిపించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. దానికి కాస్త సెంటిమెంట్ కూడా రంగరిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు లేకపోయినా, అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోయినా ప్రాజెక్టులు మంజూరు చేస్తుంది. నిధులు కుమ్మరిస్తుంది. ఇక బడ్జెట్ (Union Budget) ప్రవేశపెట్టే సమయంలో పార్లమెంటు వేదికగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీలు ఇస్తారు. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై ఇలాంటి అస్త్రాన్నే ప్రయోగించింది. ఫలితంగా కొన్ని సీట్లు గెల్చుకోగలిగింది. రెండేండ్ల ముందు బీహార్ విషయంలోనూ అదే ప్రయోగం చేసింది. పవర్‌లోకి వచ్చింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరిగబోయే సమయంలో ఆ ఒరవడిని రిపీట్ చేస్తుందేమోననే చర్చ మొదలైంది. అందుకే ఆ రాష్ట్రాలపై నిర్మలమ్మ ఎలాంటి ప్రేమ చూపిస్తారు?.. ఎన్ని వేల కోట్ల నిధులు బడ్జెట్‌లో కేటాయిస్తారు?.. ఎలాంటి ప్రాజెక్టులను ఇస్తారు?.. ఇవీ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు.

సెంటిమెంట్.. డెవలప్‌మెంట్.. :

పశ్బిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినా సీట్లన పెంచుకోగలిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ దూకుడును కట్టడి చేయగలిగింది. ఈసారి పవర్‌లోకి రావాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. కొన్ని నెలల ముందే ‘వందేమాతరం’ గీతాన్ని సెంటిమెంటల్‌గా వాడుకున్నది. తమిళనాడులో హిందు భావోద్వేగం కోసం తిరుప్పర్‌కుండ్రం దీప ప్రజ్వలన అంశాన్ని ఎంచుకున్నది. బీజేపీ నేతలు దీన్ని పదేపదే ప్రస్తావించి చర్చనీయాంశంగా మార్చారు. జాతీయ స్థాయిలోనే హాట్ టాపిక్‌గా మారింది. దీనికి తోడు పార్లమెంటు కొత్త భవనంలో ‘సెంగోల్’ ప్రతిష్ఠాపనతో తమిళ సెంటిమెంట్‌ను బీజేపీ వాడుకున్నది. ఇక కేరళ విషయంలో ఇటీవల శబరిమల దర్శనాలపై జరిగిన హడావిడి, అందులో బీజేపీ పోషించిన పాత్ర సరేసరి. ఆ ప్రభావం ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయానికి దారితీసింది. మరింత వాడివేడిగా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని తహతహలాడుతున్నది.

ఆ రాష్ట్రాలకు వరాలపైనే ఊహాగానాలన్నీ.. :

దేశం మొత్తానికి వర్తించేలా బడ్జెట్ (Union Budget) తయారు చేస్తున్నా దాన్ని లెక్కల పద్దుగా మాత్రమే కాక దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పున పశ్చిమబెంగాల్‌లో నిలదొక్కుకోడానికి రాజకీయ వ్యూహంగానూ బీజేపీ తీర్చిదిద్దుతున్నది. 2021లో తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసింది. 2024 బడ్జెట్‌ను బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిధులు కుమ్మరించింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో అదే ట్రెండ్‌ను కొనసాగించాలనే మాటలూ బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

2021 బడ్జెట్‌లో బెంగాల్ సంప్రదాయ చీరను కట్టుకుని వచ్చిన నిర్మలా సీతారామన్ రూ. 25 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులను, తమిళనాడు లక్ష కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు, కేరళకు ముంబై-కన్యాకుమారి కారిడార్ కోసం రూ. 65 వేల కోట్లను కేటాయించారు. ఇక అసోం టీ గార్డెన్ కార్మికులకు వరాలు కురిపించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్‌కు ఎయిర్‌పోర్ట్ విస్తరణ, ఐఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మఖానా బోర్డు ఏర్పాటు, వేల కోట్ల అభివృద్ధి పనులు మంజూరు.. ఇవన్నీ ప్రకటించింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలను గమనంలోకి తీసుకుని అలాంటి వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: బీహార్ ప్రభుత్వం కీలకం నిర్ణయం.. ఉద్యోగుల సోషల్ మీడియాపై ఆంక్షలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>