కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీవీకే చీఫ్ (TVK Chief), సినీ నటుడు విజయ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు కేంద్రంపై, ఇటు తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీబీఐకు సైతం పరోక్షంగా వార్నింగ్ ఇస్తూ ఎక్కడా తగ్గడం లేదు. ఆదివారం ఆయన మామల్లపురంలో 3,000 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తాను ‘ఒత్తిడికి లోనవ్వనని, ‘వంగి నమస్కరించను’ అని ఇతర పార్టీలనుద్దేశించి కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎలాంటి పొత్తులుండవని తేల్చిచెప్పారు. ‘‘ఇది కేవలం ఎన్నికలు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం. ఈ యుద్ధంలో పోరాడే నా కమాండోలు మీరే” అని కార్యకర్తలనుద్దేశించి అన్నారు. డీఎంకే (DMK), ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేలను లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నవారు అన్నా (ద్రవిడ రాజకీయాక సిద్ధాంతకర్త అన్నాదురై)ను మరచిపోయారని సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్న పార్టీలకు పోలింగ్ బూత్‌లు బోగస్ ఓట్ల కేంద్రాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రతి ఓటును రక్షించుకోవాలని, అందరినీ కలవాలని కార్యకర్తలకు టీవీకే చీఫ్ విజయ్ దిశానిర్దేశం చేశారు.


